అవినీతిని అంతం చేయాలి

Corruption must end– రైల్వే చీఫ్‌ విజిలెన్స్‌ అఫీసర్‌ అర్వింద్‌ మల్ఖేడే
నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో
అవినీతిని అంతం చేసేందుకు ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ విజిలెన్స్‌ అఫీసర్‌ అర్వింద్‌ మల్ఖేడే అన్నారు. అవినీతికి పాల్పడినా, ప్రలోభపెట్టినా నేరమేననీ, దేశ భవిష్యత్‌ నిర్దేశకులు ప్రభుత్వ ఉద్యోగులేననీ, వారు అవినీతికి దూరంగా ఉంటే, ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవల్ని అందించగలుగుతామని అభిప్రాయపడ్డారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి కాచిగూడ రైల్వే స్టేషన్‌లో విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నిర్వహించిన అవగాహనా ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అవినీతికి కారణాలు, అవినీతి పద్ధతులు, వాటిని అరికట్టే విధానాలపై ఉద్యోగులకు విశదీకరించారు. అనంతరం ‘నుక్కడ్‌’ అనే నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ డివిజన్‌ ఏడీఆర్‌ఎం/ఆపరేషన్స్‌ ఎం.కోటేశ్వరరావు, ఏడీఆర్‌ఎం/ఇన్ఫ్రా ఎమ్‌ఏ రెహ్మాన్‌, సీనియర్‌ డి.సి.యం. వై బాలాజీ కిరణ్‌, సీనియర్‌ డి.ఇ.ఇ. కే కిరణ్‌ కుమార్‌, సీనియర్‌ డి.యం.ఇ. జీషన్‌ అహ్మద్‌, డి.పి.వో/కో-ఆర్డినేషన్‌ ఎ.జె.వి.ప్రకాష్‌ కుమార్‌, డి.ఇ.యన్‌/ఎస్టేట్‌ శశాంక్‌ యాదగిరి, స్టేషన్‌ డైరెక్టర్‌/కాచిగూడ కే బాలాజీ, ఎ.డి.ఇన్‌.హెచ్‌.యమ్‌. బాబులు, ఎ.డి.ఇ.యన్‌./ఎస్టేట్‌ బి.రాము, స్టేషన్‌ మేనేజర్‌/కాచిగూడ ఆర్‌.బి.మీనా తదితరులు పాల్గొన్నారు.