– టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు : ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేవాలయ సందర్శకులకు సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ఆలయ భూముల్లో కాటేజీలు నిర్మించి టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆయన అధ్యక్షతన దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖల బడ్జెట్ అంచనాల ముందస్తు సమీక్ష సమావేశం జరిగింది. దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, పర్యావరణ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి విస్తత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆదాయం లేని దేవాలయాలకు ధూప దీప నైవేద్యం కింద ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని మరింత సరళతరం చేయాలని సూచించారు. ప్రధానంగా అటవీ శాఖతో కలిసి టెంపుల్ టూరిజాన్ని, ఎకో టూరిజంతో కలిపి టూరిస్ట్ సర్క్యూట్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో నాగోబా, మేడారం లాంటి గిరిజన జాతరలకు సంబంధించి దేశ, విదేశీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. అటవీ సంపద, వన్య ప్రాణుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏజెన్సీ, అటవీ భూముల్లో గిరిజనులకు ఆర్థిక మేలు జరిగేలా ఆయుర్వేద సంబంధిత మెడిసినల్ ప్లాంటేషన్లను చేపట్టాలనీ, ఆయుష్ శాఖ, ఆయుర్వేద మందుల కంపెనీలతో మార్కెటింగ్‌ను అనుసంధానం చేయాలని సూచించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అన్యాక్రాంతమైన దేవుడి మాన్యాల భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణా భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. వన్యప్రాణుల దాడుల్లో ఎవరైనా మరణిస్తే పరిహారాన్ని రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచామన్నారు. బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీలను తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. దేవాదాయ, అటవీ శాఖలకు బడ్జెట్ నిధులను ఉదారంగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ కమీషనర్ అనిల్ కుమార్, అటవీశాఖ ప్రిన్సిపాల్ సీసీఎఫ్ డోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు.
రవాణాశాఖపై సమీక్ష
అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని రవాణా శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వంపై ప్రజల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మంగళవారంనాడాయన ప్రీ బడ్జెట్ ప్రతిపాదనలపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మి కార్యక్రమం అమలులో ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పారు. రవాణా శాఖ పనితీరును మెరుగుపరచలాలనీ, అంతర్గత ఆదాయం, సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి ఆశించిన లేనందున, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాల్సి ఉందన్నారు.
ఆర్టీసీ పనితీరును ఆయన ప్రశంసించారు. మెట్రోరైలు తరహలో ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు వివిధ నమూనాలతో అధ్యయనం చేయాలని సూచించారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరును మెరుగుపర్చాలనీ, చేతివృత్తుల వారి నైపుణ్యాలను పెంచేందుకు అధ్యయనం చేయాలని చెప్పారు. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంతో కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడిందనీ, అలాగే సంస్థలోరిక్రూట్‌మెంట్లు కూడా చేపట్టాల్సి ఉందని సమావేశంలో పాల్గొన్న రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం సంవత్సరానికి 300 మందికి ఓవర్సిస్ స్కాలర్ షిప్ మంజూరు చేస్తున్నారనీ, ఆ సంఖ్యను మరింత పెంచాలని కోరారు. సమావేశంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.