– మార్కెటింగ్ శాఖ, సీసీఐ, ప్రయివేటు వ్యాపారుల కుమ్మక్కు
– నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి : రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు
– పత్తి మిల్లుల ఎదుట రాస్తారోకో
నవతెలంగాణ-సదాశివపేట
పత్తి కొనుగోలు విషయంలో మార్కెటింగ్ శాఖ, సీసీఐ, ప్రయివేటు వ్యాపారుల కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రైతుల వద్ద ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు రోడ్‌లోని అన్నపూర్ణ సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా, రాస్తారోకో చేశారు. పత్తిని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ.. పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడుతున్న రైతులకు ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో చలిలో రాత్రిపూట రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ కొనకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారన్నారు. క్వింటాల్ పత్తికి సీసీఐ రూ.7020కి కొనుగోలు చేస్తే ప్రయివేటు వ్యాపారులు రూ.5 వేల నుంచి రూ.6 వేలకు కొంటున్నారని తెలిపారు. ప్రయివేటు వ్యక్తులు, సీసీఐ, మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులకు నష్టం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు భూషణం, ఏసోబు, ప్రసాద్, రైతులు జగదీష్, భాస్కర్, రవి, బాలమని, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.