– మొలకలకు నీళ్లు పోస్తున్న రైతన్న
నవతెలంగాణ-భైంసా
మృగశిర ప్రారంభమైనప్పటి నుండి భైంసా మండలంలో లోటు వర్షపాతం నమోదు అవ్వడంతో రైతులు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలో కరువు చాయలు స్పష్టంగా కనబడుతున్నాయి. అడపాదడప కురిసిన వర్షంతో రైతులు పత్తి విత్తనాలు విత్తగా ఎనిమిది రోజుల నుండి వర్షపు జాడ లేకపోవడంతో బిందెలతో పత్తి మొలకలకు నీళ్లు పోసి కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఎకరానికి రూ.10, 15 వేల పెట్టుబడి పెట్టడంతో మొలకలు వచ్చిన సంతోషంలో రైతు ఉన్నప్పటికీ వరుడు జాడ లేకపోవడంతో వారికి కునుకు పట్టడం లేదు. మండలంలో ప్రధానంగా పండించే పంట పత్తి విత్తనం మొలకెత్తినప్పటికీ వర్షాలు లేకపోవడం వల్ల ప్రస్తుతం మొలకలు ఎండిపోతున్నాయి. ఒకచోట వర్షం కురిస్తే మరోచోట కురవకపోవడంతో పాటు దినమంత వేసవిని తలపించే మండుటెండ ఉండడంతో మొక్కలను కాపాడుకోవడానికి ప్రతిరోజు నీరు పోయాల్సిన దుస్థితి.