– మను చేజారిన హ్యాట్రిక్ కాంస్యం
– నాల్గో స్థానంలో నిలిచిన మను బాకర్
– 25మీ పిస్టల్ ఫైనల్లో నిరాశ
– పారిస్ 2024 ఒలింపిక్స్
బ్యాడ్మింటన్‌లో పతకాలు సాధిస్తారని ఆశించిన షట్లర్లు నిరాశపరిచారు. బాక్సింగ్‌లో మెడల్ పంచ్ విసురుతారని అనుకున్న బాక్సర్లు రింగ్‌లో తేలిపోయారు. విలువిద్యలోనూ ఆఖరు వరకు ఊరించి ఉసూరుమనిపించారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలతో సత్తా చాటిన యువ షుటర్ మను బాకర్ మూడోదీ తీసుకొస్తుందనే దీమా కోట్లాది భారతీయుల్లో కనిపించింది. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో ఆఖరు వరకు పతకం కోసం పోటీపడిన మను బాకర్ నాల్గో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో నాల్గో స్థానంలో నిలిచి భారత్ మెడల్ కోల్పోవటం ఇది మూడోసారీ!.
నవతెలంగాణ-పారిస్
భారత్‌కు రెండు కాంస్య పతకాలు అందించిన గన్.. మూడో ప్రయత్నంలో తడబడింది. అర్హత రౌండ్‌లో అదరగొట్టిన పిస్టల్.. ఫైనల్లో అంచనాలను అందుకోలేదు. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో మెడల్స్‌తో కెరీర్ భీకర ఫామ్, ఆల్‌టైమ్ ఆత్మవిశ్వాసంతో కనిపించిన మను బాకర్ ఆఖరు మెడల్ రేసులో మెడల్ లైన్‌కు ఆవల ఆగిపోయింది. శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగం ఫైనల్లో మను బాకర్ నాల్గో స్థానానికి పరిమితమైంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ మూడు పతక ఈవెంట్లలో నాల్గో స్థానంలో నిలిచి మెడల్‌కు దూరమైంది. షుటర్ అర్జున్ బబుత.. ఆర్చర్లు దీరజ్ బొమ్మదేవర, అంకితలు సైతం తమ పతక ఈవెంట్లలో నాల్గో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజార్చుకున్నారు. రెండు ఒలింపిక్ పతకాల విజేత మను బాకర్ సైతం ఇప్పుడు ఈ జాబితాలో చేరింది. ఒకే ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ మెడల్స్ సాధించి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాలని ఆశించిన మను బాకర్.. ఆఖరు అడుగులో గురి తప్పింది. ఒలింపిక్స్ పోటీల్లో శనివారం భారత్‌కు మెడల్స్ ఏమీ దక్కలేదు. మూడు కాంస్య పతకాలే ఇప్పటి వరకు భారత్ ఖాతాలో పడ్డాయి.
నాల్గో స్థానంతో సరి!
మహిళల 25 మీటర్ల పిస్టల్ అర్హత రౌండ్‌లో మను బాకర్ టాప్ లేపింది. ర్యాపిడ్, ప్రిసిజన్ రౌండ్లలో రెండో స్థానంలో నిలిచింది. దీంతో సహజంగానే ఫైనల్లో మను బాకర్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. శనివారం జరిగిన ఫైనల్లో టాప్-8 షుటర్లు పోటీపడ్డారు. ఆఖరు వరకు మెడల్ రేసులో నిలిచిన మను బాకర్.. కాంస్య పతకాన్ని హంగరీ అమ్మాయి వెరోనికాకు కోల్పోయింది. వెరోనికా అర్హత రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచినా.. ఫైనల్లో ఆమె సైతం తడబాటుకు లోనైంది. కాంస్య పతక పోటీలో వెరోనిక మేజర్ పైచేయి సాధించింది. 31 పాయింట్లతో హంగరీ అమ్మాయి కాంస్య పతకం సొంతం చేసుకుంది. 28 పాయింట్లతో మను బాకర్ నాల్గో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా అమ్మాయి యాంగ్ జిన్ (37) స్వర్ణం సాధించగా, ఫ్రాన్స్ షుటర్ కామిలె (37) సిల్వర్ మెడల్ దక్కించుకుంది.
హాకీ ఇండియాకు బ్రిటన్ సవాల్
హాకీలో టీమ్ ఇండియా కఠిన సవాల్‌కు సిద్ధమైంది. 2020 టోక్యో ఒలింపిక్స్ తరహాలో పారిస్‌లోనూ క్వార్టర్‌ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. పూల్-బిలో రెండో స్థానంలో నిలిచిన భారత్.. పూల్-ఏలో మూడో స్థానంలో నిలిచిన గ్రేట్ బ్రిటన్‌తో నేడు క్వార్టర్‌ఫైనల్లో ఆడనుంది. బెల్జియం, స్పెయిన్.. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా.. జర్మనీ, అర్జెంటీనా మధ్య క్వార్టర్‌ఫైనల్ మ్యాచులు సైతం నేడు జరుగనున్నాయి. మూడేండ్ల క్రితం టోక్యోలో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత్ 3-1తో విజయం సాధించింది. పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధతలో టీమ్ ఇండియా మరింత పటిష్టంగా మారింది. ఆరంభంలో ఫార్వర్డ్‌లు కాస్త నిరాశపరిచినా.. గ్రూప్ దశలో మ్యాచులు సాగుతున్న కొద్ది మెరుగయ్యారు. అభిషేక్, హర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్‌లు భారత్‌కు కీలకంగా మారారు. ఫార్వర్డ్‌లు గోల్ అవకాశాలు సృష్టించటం, ప్రత్యర్థిపై సమర్థవంతంగా దాడి చేయటంలో ఆకట్టుకుంటుంది. డిఫెన్స్‌లో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ గోడ కడుతున్నాడు. అతడిని దాటుకుని వెళ్లటం ప్రత్యర్థులకు గగనమవుతుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ వేటలో అదరగొడుతున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ గోల్ నమోదు చేశాడు. నేడు క్వార్టర్‌ఫైనల్లోనూ హర్మన్‌ప్రీత్, అభిషేక్ ప్రదర్శన ఎక్స్ ఫ్యాక్టర్‌గా నిలువనుంది. భారత్, గ్రేట్ బ్రిటన్ హాకీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానుంది.
లక్ష్యం చేరుకుంటాడా?
బ్యాడ్మింటన్‌లో కచ్చితంగా పతకం తీసుకొస్తారని ఆశించిన పి.వి సింధు సహా సాత్విక్, చిరాగ్ జోడీ నిరాశపరిచారు. పురుషుల సింగిల్స్‌లో యువ కెరటం లక్ష్యసేన్ ఒక్కడే ఇప్పుడు బ్యాడ్మింటన్‌లో భారత పతక ఆశల భారాన్ని మోస్తున్నాడు. ఒలింపిక్స్‌లో మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ ఆడుతున్న తొలి భారత పురుష షట్లర్‌గా రికార్డు నెలకొల్పిన లక్ష్యసేన్.. నేడు కెరీర్‌లో బిగ్టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. ఒలింపిక్స్ డిఫెండింగ్ గోల్డ్ మెడలిస్ట్, అగ్రశ్రేణి షట్లర్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్)తో లక్ష్యసేన్ నేడు సెమీఫైనల్లో తలపడనున్నాడు. సెమీఫైనల్‌కు చేరుకునే క్రమంలో తనకంటే మెరుగైన ర్యాంకర్లపై విజయాలు సాధించిన లక్ష్యసేన్ నేడు సెమీస్‌లోనూ అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాడు. విక్టర్ అక్సెల్సెన్‌తో లక్ష్యసేన్ ముఖాముఖి రికార్డు 1-7. ఇటీవల సింగపూర్ ఓపెన్‌లో విక్టర్‌తో మూడు గేముల ఉత్కంఠ మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. గతంలో విక్టర్‌ను ఓడించిన స్ఫూర్తితో లక్ష్యసేన్ ఉత్తమ ప్రదర్శన చేయగలిగితే భారత బ్యాడ్మింటన్‌లో సరికొత్త చరిత్ర లిఖించే అవకాశం దక్కనుంది.