మున్సిపల్ అభివృద్ధిలో కౌన్సిల్ సభ్యులు చెరగని ముద్ర వేశారని.. దుబ్బాక పట్టణ అభివృద్ధి కోసం కౌన్సిలర్లు కృషి చేసిన తీరు అభినందనీయమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక మున్సిపల్ నుంచే తనకు అత్యధిక మెజార్టీ లభించిందని అందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.బుధవారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన చివరి కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైనారు.అనంతరం చైర్ పర్సన్ వనిత భూమిరెడ్డి,వైస్ చైర్ పర్సన్ సుగుణ బాలకిషన్ గౌడ్,కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూ.24 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్,ఏఈ శ్రీకాంత్,టీపీఓ గిరిధర్,సీనియర్,జూనియర్ అకౌంటెంట్స్,ఆయా వార్డుల ఆఫీసర్లు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.