
నవతెలంగాణ – చేర్యాల
గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ లో ఉన్న తన కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా కేసులు, బెదిరింపులకు గురి చేయడంతో ఆ పార్టీలో చేరామని కౌన్సిలర్ ఆడెపు నరేందర్ తెలిపారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం సమక్షంలో కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ ఆడెపు చంద్రయ్య తన కుమారులు చేర్యాల మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్ ఆడేపు నరేందర్, ఆడెపు మహేష్ లతో పాటు గ్రంథాలయం మాజీ చైర్మన్ నాగుల వెంకటేశం సుమారు 200 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కౌన్సిలర్ నరేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ లో చేరినప్పటి నుండి నా కుటుంబానికి సముచిత స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలు, అప్పటి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు వార్డు ప్రజలకు వెన్నంటి ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినా గుర్తింపు దక్కలేదన్నారు.