– భారత బడ్జెట్ 2024లో ఎలా ఉండబోతోంది..?
– మధ్యంతర బడ్జెట్ గణాంకాలపైనే అందరి దృష్టి
మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రవేశపెట్టనున్న భారత బడ్జెట్..2024పై దేశప్రజల దృష్టి కేంద్రీకృతమైంది.తొమ్మిదేండ్లుగా ప్రవేశపెట్టిన బడ్జెట్లు కేవలం కార్పొరేట్ వర్గాలకే ఊరట నిచ్చాయన్నది నూటికి నూరుపాళ్లు నిజమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మధ్యంతర బడ్జెట్‌లో కీలకమైన రంగాలు, కేటాయింపుల వైపే ఆసక్తి చూపుతున్నారు.
న్యూఢిల్లీ : బడ్జెట్‌కు ఒక నెల కంటే తక్కువ సమయం ఉన్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన ఆరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఓట్ ఆన్ అకౌంట్ అవుతుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తి బడ్జెట్ (కేంద్ర బడ్జెట్ 2024) సమర్పించనున్నారు. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీని తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. మధ్యంతర బడ్జెట్‌లో మోడీప్రభుత్వం పెద్దగా ప్రకటనలు చేయదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆదాయపు పన్ను నిబంధనలలో పెద్ద మార్పులను నివారిస్తుంది. కానీ, ఈ బడ్జెట్‌లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన డేటా ఉంటుందని సంకేతాలిస్తోంది. బడ్జెట్‌లో కీలక రంగాలు, కేటాయింపులు ఉంటాయి. అయితే ముఖ్యమైన కొన్నింటిని పరిశీలిద్దాం..
ఆర్థిక వ్యవస్థకు ద్రవ్య లోటు గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ప్రభుత్వ ఆర్థిక లోటు ఎంత తగ్గితే అంత మంచిది. ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఫిబ్రవరి 1, 2023 న సమర్పించిన బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్రవ్య లోటును 5.9 శాతానికి ప్రకటించారు. ద్రవ్యలోటు ఈ లక్ష్యానిక నుగుణంగానే ఉంటుందని అంచనా. 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ప్రభుత్వం 6.4 శాతం ఆర్థిక లోటును లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 1, 2024న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు లక్ష్యాన్ని ప్రకటిస్తారు.
బడ్జెట్ పరిమాణం
ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నం దున ఈసారి బడ్జెట్ పరిమాణం పెద్దదిగా ఉంటుందని భావిస్తు న్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా తాయిలాలు ప్రకటించే అవకాశాలు లేకపోలేదని కేంద్రం లీకులు ఇస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే సామాజిక పథకాలపై వ్యయాన్ని పెంచనున్నది. ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించవచ్చు. ఇలా చేయడం వల్ల బడ్జెట్ పరిమాణం పెరుగుతుంది. 2019 మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రకటించింది. ఫిబ్రవరి 1, 2023న సమర్పించిన కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ. 45 లక్షల కోట్లు. ఈసారి ఈ సంఖ్య రూ.50 లక్షల కోట్లు దాటవచ్చు.
మూలధన వ్యయం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మూలధన వ్యయం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ వేగాన్ని పెంచేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుండటమే ఇందుకు కారణం. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మూలధన వ్యయం రూ.10 లక్షల కోట్లకు పైగా ఉంది.
ఇది ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం కోసం ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లకు పైగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో, ప్రభుత్వ మూలధన వ్యయం గణాంకాలపై దృష్టి పెట్టొచ్చు.
జీడీపీ అంచనా
కేంద్ర బడ్జెట్‌లో జీడీపీ నామమాత్రపు వృద్ధిని ప్రభుత్వం ప్రకటించింది. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరానికి జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ అంచనా ఏమిటో ఇది తెలియజేస్తోంది. ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేసినప్పుడే జీడీపీ వాస్తవ వృద్ధి ఎంతో తెలుస్తోంది. ఫిబ్రవరి 1, 2023న సమర్పించిన బడ్జెట్‌లో జీడీపీ నామమాత్రపు వృద్ధిని 10 శాతంగా ప్రభుత్వం అంచనా వేసింది.
పెట్టుబడుల ఉపసంహరణ
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.51,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు రూ.10,051 కోట్లు మాత్రమే వచ్చాయి. పెట్టు బడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని మోడీ సర్కార్ తెగ తర్జనభర్జన పడుతోంది. యూపీఏ ప్రభుత్వం విక్రయించిన దానికి మించి కేంద్రంలోని బీజేపీ సర్కార్ హౌల్‌సేల్‌గా ప్రభుత్వరంగసంస్థలను బేరానికి పెట్టిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం ఏ లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.