వైసీపీకి కౌంట్‌డౌన్‌

వైసీపీకి కౌంట్‌డౌన్‌– మళ్లీ ఈ ప్రభుత్వం వస్తే రాష్ట్ర భవిష్యత్‌ మర్చిపోవడమే
– భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
గుంటూరు :‘ఎన్నికలకు కేవలం 87 రోజులే గడువు ఉంది. వైసీపీ దుష్టపాలనకు అమరావతి నుంచే కౌంట్‌డౌన్‌ మొదలైంది’ అని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి వేడుకలు మందడంలోనే జరుపు కుంటామని చెప్పారు. రాజధాని ప్రాంతం మందడంలోని గోల్డెన్‌ రూల్‌ స్కూల్‌ ఆవరణలో ఆదివారం ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో జరిగిన భోగి మంటల కార్యక్ర మంలో చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అమరావతి రాజధాని వ్యతిరేక ఉత్తర్వుల ప్రతులను భోగి మంటల్లో వారు దహనం చేశారు. సంప్రదాయ దుస్తులు పంచె కట్టుకొని చంద్రబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతిని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మో హన్‌రెడ్డి నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన పార్టీ పొత్తుతో అమరావతే రాజధానిగా పాలన సాగనుందన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం వృథా కావని, ఏ ఉద్దేశంతో రాజధాని నిర్మాణానికి భూములిచ్చారో ఆ ఉద్దేశం నెరవేరనుందని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వగా ఇంకా 8 వేల నుంచి పది వేల ఎకరాల భూములు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వాటిని అమ్మితే సుమారు రూ.మూడు లక్షల కోట్ల సంపద సమకూరేదని తెలిపారు. వైసిపి పాలనలో భవన నిర్మాణ కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత ఇలా…. ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ తీరు మారాలన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రజలకు చీకటి తప్ప వెలుగు లేదని విమర్శించారు. అంగన్‌వాడీలు 34 రోజులుగా సమ్మె చేస్తూ రోడ్లపై ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం దారుణమన్నారు. తాము అధికారంలోకి వస్తే విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసి పూర్వ వైభవం తీసుకొస్తామని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సుస్థిర పాలన కోసం టీడీపీ, జనసేన పార్టీ కృషి చేస్తున్నాయన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్ర భవిష్యత్‌ మర్చిపోవడమేనని అన్నారు. రాజధాని రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు కౌలు కోసం ముళ్ల కంచెలు దాటుకొని వచ్చి అమరావతిలో ఆందోళన చేశామని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు పట్టించుకోలేదని విమర్శించారు. కౌలు రైతుల కుటుంబాలకు తమ పార్టీ ఆధ్వర్యంలో రూ.లక్ష చొప్పున అందజే శామని గుర్తు చేశారు. అమరావతి సమస్య రాష్ట్ర ప్రజలందరి సమస్యని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌, వర్ల రామయ్య, జనసేన పార్టీ పీఏసీ చైర్మెన్‌ నాదెండ్ల మనోహర్‌, బోనబోయిన శ్రీనివాస యాదవ్‌, గాదె వెంకటేశ్వరరావు, అమరావతి జేఏసీ నాయకులు పాల్గొన్నారు.