– ఉపఎన్నికలో ఓటమి పాలైన మంత్రి
– కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాభవం
జైపూర్ : రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి, అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కరణ్‌పూర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి రూపేందర్ సింగ్ కూనర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి, రాష్ట్ర మంత్రి సురేందర్‌పాల్ సింగ్‌ను 11,283 ఓట్ల మెజారిటీతో ఓడించారు. కూనర్‌కు 94,950 ఓట్లు లభించగా సురేందర్‌పాల్‌కు 83,667 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో విజయం సాధించిన రూపేందర్‌ను మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభినందించారు. ప్రవర్తనా నియమావళికి, నైతికతకు తిలోదకాలు ఇచ్చిన బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. శాసనసభ్యుడు కాని సురేందర్‌పాల్‌ను బీజేపీ ఏకంగా మంత్రిని చేసిందని, ఉప ఎన్నికలో నిలబెట్టిందని, దీనిని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. గత నెల 30న జరిగిన మంత్రిమండలి విస్తరణలో చట్టసభ సభ్యుడు కాని సురేందర్‌పాల్‌ను మంత్రిగా నియమించారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వైపు ఉప ఎన్నికలో పోటీ చేస్తూనే మరోవైపు మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని విమర్శించింది. కాగా కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ మృతి కారణంగా కరణ్‌పూర్‌లో ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 199 స్థానాలకే (మొత్తం స్థానాలు 200) ఎన్నికలు జరిగాయి. కూనర్ కుమారుడు రూపీందర్ సింగ్‌నే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ఉపఎన్నిక బరిలో నిలిపింది.