– ఇద్దరు మావోయిస్టులు మృతి
నవతెలంగాణ-చర్ల
రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సుక్మా దండకారణ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. పిడియా దండకారణ్యంలో మావోయిస్టులు రహస్య సమావేశం ఏర్పాటు చేశారని విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగలూర్ ముతవెండి నుంచి బీజాపూర్ డీఆర్జీ బస్తర్ ఫైటర్స్ సీఆర్పీఎఫ్ కోబ్రా ఎస్టీఎఫ్ బలగాలు మావోయిస్టుల కోసం బయలుదేరాయి. అలాగే సుక్మా, దంతేవాడ డీఆర్జీ బస్తర్ ఫైటర్స్ సీఆర్పీఎఫ్ బలగాలు సుక్మా జిల్లా జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్గర్ నుండి మావోయిస్టు ఆపరేషన్ కోసం బయలుదేరాయి. ఆపరేషన్ సమయంలో శనివారం ఉదయం 8:30 గంటలకు, బీజాపూర్ సుక్మా డీఆర్జీ మావోయిస్టుల మధ్య పిడియా ఫారెస్ట్‌లో కాల్పులు జరిగాయి. ఆ తర్వాత ఘటనా స్థలంలో ఆయుధాలతో పాటు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ ఎస్పీలు జితేంద్ర యాదవ్, కిరణ్ చౌహాన్ తెలిపారు. ఇదిలా ఉంటే, శుక్రవారం రాత్రి జాగరగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోడితుమ్నార్ అడవిలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలుడులో బస్తర్ ఫైటర్స్‌కి చెందిన ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడగా.. ఒక కానిస్టేబుల్ మరణించారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం రారుపూర్‌కు తరలించామని, వారి పరిస్థితి సాధారణంగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని ఎస్పీలు వివరించారు.