– కిసాన్ కాంగ్రెస్ నేతలకు మహేష్‌కుమార్‌గౌడ్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ నేతలు డబ్బులిచ్చి సోషల్ మీడియాలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై దుష్ప్రచారం చేయిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. అలాంటి దుష్ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని కిసాన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ అన్వేష్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కిసాన్ కాంగ్రెస్ పాత్ర చాలా ఉందని చెప్పారు. కష్టపడిన నాయకులకు కార్పొరేషన్ పదవుల్లో, మార్కెట్ కమిటీల్లో, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో, ఆత్మ కమిటీల్లో తగిన అవకాశాలు ఇస్తామన్నారు. పార్టీలో, స్థానిక సంస్థల్లో సరైన అవకాశాలిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేసిందన్నారు. దేశంలోనే రైతు రుణ మాఫీ రూ.18వేల కోట్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నట్టు సమాచారముందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో సమన్వయంతో పని చేయాలని కోరారు.