– వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి
– డ్రగ్ కంట్రోల్ అథారిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నకిలీ మందులు ప్రజారోగ్యానికి ప్రమాద కరంగా పరిణమించాయని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం డీసీఏ డైరెక్టర్ జనరల్ వీ.బీ.కమలాసన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘ వ్యతిరేక శక్తులు ప్రముఖ ఫార్మా కంపెనీలకు చెందిన బ్రాండ్లను అసలువాటిని పోలినట్టుగా ఉండేలా భ్రమింపజేస్తూ వీటిని సరఫరా చేస్తున్నాయని తెలిపారు. నకిలీ ఔషధాల్లో పూర్తిగా ఔషధాలు లేకపోవడం, సుద్ద, మొక్కజొన్న పిండి, బంగాళాదుంప వంటివి ఉండడం లేదా పైన పేర్కొన్న ఔషధ మూల పదార్థం కాకుండా ఇతరమైనవి ఉండటం, పేర్కొన్న మోతాదు మేరకు లేకపోవడం, కొన్నింటిలో విష రసాయనాలు ఉంటున్నాయని తెలిపారు. ఇలాంటివి రోగుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని తెలిపారు. ఇవి రోగాన్ని నయం చేయకపోగా మరింత క్షీణింపజేస్తాయని పేర్కొన్నారు. వీటి కారణంగా ఆరోగ్య వ్యవస్థ, ఆరోగ్యసంరక్షకులు, ఔషధాలపై ప్రజల్లో నమ్మకం పోయే పరిస్థితి ఏర్పిందని తెలిపారు. నకిలీ ఔషధాలు అసలు ఔషధాలను పోలినట్టుగా ఉండటంతో వాటిని గుర్తించడం ఇబ్బందిగా మారుతుందని హెచ్చరించారు.
నకిలీ ఔషధాల రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చే క్రమంలో ఇప్పటికే డిసెంబర్‌లో మచ్చబొల్లారంలో నకిలీ క్యాన్సర్ ఔషధాల గోడౌన్‌ను గుర్తించి సీజ్ చేశారు. అదే విధంగా ఉత్తరాఖండ్ కాశీపూర్, ఘజియాబాద్ కేంద్రంగా రాష్ట్రంలోకి కొరియర్ ద్వారా సరఫరా అవుతున్న నకిలీ ఔషధాలను డిసెంబర్, జనవరి మాసాల్లో అడ్డుకట్ట వేశారు. సన్ ఫార్మా, గ్లెన్ మార్క్ ఫార్మా, అరిస్టో ఫార్మాస్యూటికల్స్ టొరెంట్ ఫార్మా వంటి ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ మోసం చేసే ప్రయత్నాన్ని దాడి చేసి నిలువరించినట్టు కమలాసన్ రెడ్డి తెలిపారు. చాలా సార్లు ప్రయోగశాలల్లో టెస్ట్ చేస్తే తప్ప అసలుకు, నకిలీకి తేడా గుర్తించడం కష్టమని తెలిపారు.
ప్రజలు ఇలా గుర్తించాలి
కొన్ని మందులను మనం తరచుగా ఉపయోగిస్తుంటాం. ఇలాంటి ఔషధాలకు సంబంధించి ఒక ఫోటో తీసుకుని పెట్టుకుని వాటితో సరిపోల్చి గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. తయారీదారు, ఉత్పత్తి, ఔషధ పదార్థాల పేర్లలో తప్పులుంటే అనుమానించాలి. ఔషధం ఆకృతి, సైజు ద్వారా కూడా అనుమానించవచ్చు. ధర తక్కువగా ఉండటం, పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఇవ్వడం కూడా నకిలీవి కావడానికి అవకాశముంది. 2023 ఆగస్టు తర్వాత తయారైన డీసీఏ వెబ్‌సైట్‌లో 300 టాప్ బ్రాండ్ పేర్లకు సంబంధించిన వివరాలుంటాయని తెలిపారు. లైసెన్స్ లేని ఇంటర్నెట్ ప్లాట్ ఫాంల ద్వారా కొనుగోలుచేస్తే ప్రమాదం.
ఫిర్యాదు చేయండి
ప్రజలు నకిలీ ఔషధాలుగా అనుమానిస్తే 1800 599 6969కు అన్ని పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్రంలోని ప్రతి మెడికల్ షాపులో స్థానిక డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పేరు, సంప్రదించాల్సిన నెంబరు, చిరునామా, డీసీఏ టోల్ ఫ్రీ నెంబర్ పోస్టర్ రూపంలో కనిపించేలా పెట్టాలని తెలిపారు.