– కార్పొరేట్ల-మతపరమైన సంబంధాలు ఉన్నా.. వివరాలు వెల్లడించాల్సిందే : సుప్రీం
– స్వాగతించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : కార్పొరేట్ల – మతపరమైన సంబంధాలు ఉన్నప్పటికీ.. బాండ్లపై ఉండే యూనిక్ నెంబర్లతో సహా అన్ని వివరాలను అందించాలని సుప్రీంకోర్టు సోమవారం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ని ఆదేశించింది. ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లు, ఎలక్టోరల్ బాండ్ల సీరియల్ నెంబర్లను బహిర్గతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మూడు ప్రధాన పరిశ్రమల ఛాంబర్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్టీ (ఫిక్కీ), అసోచామ్, భారత వాణిజ్య సమాఖ్య (సీఐఐ)లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీచేసింది.
పునరావలోకన చర్యలు భారతీయ, ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి దారితీస్తాయని ఫిక్కీ, అసోచామ్, సీఐఐల పిటిషన్‌లో పేర్కొన్నాయి. బాండ్ల నెంబర్ల బహిర్గతాన్ని వాయిదా వేయాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌లో దాతల పేర్లు చెప్పమని హామీ ఇచ్చినపుడు ఆ సమాచారాన్ని ఇప్పుడు ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించారు.
అయితే ఆ దరఖాస్తులేవీ జాబితా చేయలేదని కోర్టు పేర్కొంది. ఏప్రిల్ 12, 2019 నుంచి అమలులోకి వచ్చినప్పటి వివరాల సేకరణకు ఆదేశించామని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. అప్పట్లో ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేశారని, అందుకే మధ్యంతర ఉత్తర్వులకు ముందు విక్రయించిన బాండ్లను బహిర్గతం చేయమని తాము ఆదేశించలేదని కోర్టు పేర్కొంది. రాజ్యాంగ ధర్మాసనం జాగరూకతోనే ఆదేశించిందని పేర్కొంది.
తీర్పు వెలువడిన తర్వాత పారిశ్రామికవేత్తలు కోర్టును ఆశ్రయిస్తున్నారని, ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని వెల్లడించింది. ”మేం మీకు మినహాయింపు ఇవ్వలేం” అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ విచారణ సందర్భంగా మౌఖికంగా వ్యాఖ్యానించారు.
”ఒక నిర్దిష్ట పరిస్థితిలో ఒక వ్యక్తికి ఆమోదయోగ్యమైనది అదే పరిస్థితిలో ఉన్న మరో వ్యక్తికి కూడా ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి” అనే వ్యాఖ్యను జోడించారు. ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లను ఎస్‌బీఐ ఎన్నికల కమిషన్‌కు అందించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
స్వాగతించిన సీపీఐ(ఎం)
కార్పోరేట్ల – మతపరమైన సంబంధాలు ఉన్నప్పటికీ.. బాండ్లపై ఉండే యూనిక్ నెంబర్లతో సహా అన్ని వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్వాగతించారు.