ఉత్కంఠగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

– ఏవీఎన్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి,మాణిక్‌రెడ్డి మధ్య పోటీ
– ఎలిమినేషన్‌ రౌండ్‌తోనే ఫలితం వచ్చే అవకాశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎన్నికల సంఘం నిర్ణయించిన మ్యాజిక్‌ ఫిగర్‌ 12,709 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలో 29,720 ఓట్లకుగాను 25,868 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 25,416 ఓట్లు మాత్ర మే చెల్లాయి. 452 ఓట్లను చెల్లని ఓట్లుగా గుర్తించారు. వీటిలో ఏవీఎన్‌ రెడ్డికి 7,505, గుర్రం చెన్నకేశవరెడ్డికి 6,584, పాపన్నగారి మాణిక్‌రెడ్డికి 4,569 ఓట్లు వచ్చాయి. దాంతో మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏవీఎన ్‌రెడ్డి, రెండో స్థానంలో పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి, మూడో స్థానంలో టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి ఉన్నా రు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవడంతో ఎలిమినేషన్‌ రౌండ్‌ ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యతతోపాటు 14వ ఎలిమినేషన్‌ రౌండ్‌ పూర్తయ్యేసరికి ఏవీఎన్‌రెడ్డికి 7,899 ఓట్లు, చెన్నకేశవ రెడ్డికి 6,810, పాపన్నగారి మాణిక్‌రెడ్డికి 4,880 ఓట్లు వచ్చాయి.