ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేడే

– రెండు రూమ్‌లు, 28టేబుళ్లు
– మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్స్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
నవతెలంగాణ- సిటీబ్యూరో
మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్స్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం గురువారం సాయంత్రం వరకు వెలువడే అవకాశముంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. 13న జరిగిన పోలింగ్‌లో 90.40శాతం ఓట్లు పోలైన విషయం తెలిసిందే. ఈనెల 16 ఓట్ల లెక్కింపు సందర్భంగా 8మంది అదనపు కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ను కేటాయించారు. వీరిలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు ఉన్నారు. వీరిలో వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, జోగులాంబ గద్వాల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ అపూర్‌ చౌహాన్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ఎం.మనుచౌదరీ, నారాయణపేట్‌ అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌(ఎన్నికలు) పంకజ, మహబూబ్‌నగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్‌ డి.వేణగోపాల్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్‌ ఏ.నర్సింహ్మారెడ్డి ఉన్నారు.
రూమ్‌కు 14 టేబుళ్లు
ఓట్ల లెక్కింపునకు రెండు రూమ్‌ల్లో ఏర్పాట్లు చేశారు. ఒక్కో రూమ్‌కు 14 టేబుళ్లను కేటాయించారు. అందుకోసం సిబ్బంది, సూపర్‌ వైజార్‌లు, అబ్జర్వర్లు ఉదయం 6.30 గంటలలోపు కౌంటింగ్‌ కేంద్రంలో ఉండాలని రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక అలా ఆదేశాలు జారీచేశారు. ఏజెంట్లు ఉదయం 7 గంటల వరకు కౌంటింగ్‌ కేంద్రానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్‌ కోసం 28 టేబుళ్లను ఏర్పాటు చేయగా ప్రతి టేబుల్‌కూ సూపర్‌వైజర్‌, ఇద్దరు సిబ్బంది, అబ్జర్వర్‌ను నియమించారు. ఒక్కో రూంకు ముగ్గురు ఏఆర్‌ఓలు, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వద్ద మరో ముగ్గురు ఏఆర్‌ఓలుగా అడిషనల్‌ కలెక్టర్‌లను నియమించారు. గత ఎన్నికల్లో మొదటి రౌండ్‌ లెక్కింపులోనే ఫలితం వచ్చింది. ఈ సారి కూడా మొదటి రౌండ్‌లోనే ఫలితం వచ్చే అవకాశముంది. ఒకవేళ ఫలితం రాకపోతే రెండో రౌండ్‌లోనూ ఓట్లను లెక్కించడానికి ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
ఫలితాలపై ఉత్కంఠ
టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులు ఎవరికివారే గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాపన్నగారి మానిక్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఏవీఎన్‌రెడ్డి మధ్యనే తీవ్రమైన పోటీ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు : వికాస్‌రాజ్‌
టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. బుధవారం సరూర్‌నగర్‌ స్టేడియంలో కౌంటింగ్‌ సెంటర్‌ను వికాస్‌రాజ్‌ పరిశీలించారు.