కాకి ముక్కు దొండ పండు లెక్క

సామెతలు సౌందర్యంగ వుంటయి. కొందరి మనుషులను చూసి వాల్ల సోపతిని చూసి వివరంగా చెప్పరు. ఆ… ఏమున్నది అని నిట్టూర్చి ‘కాకి ముక్కుకు దొండపండు లెక్క’ అని అంటరు. అంటే కర్రె గుండె కాకి ముక్కుకు దొండపండు ఎర్రగ వుండది. రెండు వేరు వేరు అనే రీతిలో ఈ సామెత వాడతరు. కాకులు లోకం మీద మస్తు కనిపిస్తయి. పగటి బువ్వ తినేప్పుడు ‘కాకి ఒర్రుతే ఇంటికి సుట్టాలు వస్తుండ్రు’ అని అంటరు. ఎనుకటి కాలం సుట్టాలు రావడం అంటే పండుగ లెక్క అనుకునేవాల్లు. కాకి అరుపులను చూసి అన్నం కూర ఎక్కువ వండేవాల్లు. ఎవల పిల్లలు వాల్లకు ముద్దు వస్తరు కొందరికి అందరి పిల్లలు ముద్దుగ అన్పిస్తరు గానీ వున్నోల్లు, లేనోల్లు, సదువుకున్నోల్లు, సదువురానివాల్లు వుంటరు కదా. ఈ ఇండ్లల్ల ఒగల పిల్లలను ఒగలు ఎత్తుకోరు. అందుకే ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అంటరు. మొదటి నుండి నల్లని రంగును అపశకునంలా భావించిన కాలం వల్ల కాకి కర్రెగ వుంటదని, అది ముద్దు రాదనే భావనలో వుంటరు. అందుకే ‘కాకి గోల కాకి గోల’ అని కూడా అంటరు. లేదంటే ‘కాకులోలె ఏం ఒర్రుడురా’ అని కూడా అంటరు. అల్లరికి కాకినే ఉదహరిస్తారు. అట్లనే ‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టడన్నట్టు’. అందరి మధ్యన ఏదైనా వస్తువు పోతే ఎవలు తీసిండ్రు అంటే ‘కాకులు రోకండ్లు ఎత్తుక పోయినట్లు’ అని ఆ దొంగతనాన్ని సులువు చేస్తరు. అట్లనే కొందరు బెదిరించి సంపాదించిన సొమ్ముతో ఏదైనా ఉపయుక్తమైన పని చేస్తరు. వాల్లను ‘కాకులను కొట్టి గద్దలకు ఏసినట్లు’ అంటరు. ‘కాకి గూట్లె కోకిల పిల్లలు’ పెరిగినట్లు అనే సామెత కూడా వాడుతుంటరు. కాకులపైన ఊర్ల్లల్లో ఎన్ని సామెతలున్నయి. ఎవరైనా చనిపోతే మూడో రోజు పిట్టకు పెట్టుడు వుంటది. ఆ కార్యక్రమం అయిన తర్వాత ‘కాకి ముట్టిందా కాకి ముట్టిందా’ అని అందరూ ఆరా తీస్తరు. కొందరు బక్కగ చిన్నగ వుంటరు. మీదికి మాటలు పనులు పెద్దగ వుంటయి. అటువంటి వాల్లను ‘కాకికి కంకెడు లేడు పిట్టకు పిడికెడు లేడు’ వీడేదో పెద్ద మాట్లాడుతుండు అంటరు.
– అన్నవరం దేవేందర్‌, 9440763479