బండ్లకు చక్రాలు మనుషులకు కాళ్లు
కథలకు కాలం
వీటి సారాంశం కదలడం
చలనం లేని జీవం శవంతో సమానం
చూపులు చేరని దారి వెంట
ఊహలు చూడని కాలం వెంట
రేపటి కోసం ఆశల వంతెనలు
నేటి దోపిడి వ్యవస్థ
ఆ ఆశలను సైతం సమాధి చేస్తోంది.
వ్యధాగాథలను తారులోని
నలుపులా నింపుకున్న దారి
పేదలకు సొంత ఇళ్లులా మారిన దారి
దుమ్మూ ధూళినే
శ్వాసక్రియకు అలవాటైన బతుకులు
ఊబి లాంటి పేదరికంలో ఊసరిల్లె ఉసురులు
ఆకలి చూపుల దప్పిక తీర్చే అశ్రువులు
రవి ఉదయిస్తాడు అస్తమిస్తాడు
కానీ ఈ ఆకలి తగ్గేది ఎప్పుడు?
దారిద్రాన్నే మకుటంగా ధరించిన దేశం
నేల తల్లి నైతిక విలువల
వలువలు ఊడ పీకిన పట్టక
స్వార్ధం మత్తులో శీలాన్ని
విక్రయించే జనులు నా దేశ పౌరులు
హరితహారం నా దేశం
కర్షకుల కన్నీటి తడితో మొలకెత్తే పచ్చనిదనం
సిరుల గర్భ నా దేశం
కార్మికుడి స్వేదంతో కడిగిన మట్టిలోని మాణిక్యం
శాంతి సీమ నా దేశం
మానవ మనుగడను శాసించే కుల మతోన్మాదం
జాతీయ జెండా కన్నా రంగులు మార్చే
రాజకీయ జెండాలపై వెచ్చటి వ్యామోహం
మానవత్వాన్ని ఆది మానవుల
కాలానికే పరిమితం చేసి
మతతత్వాన్ని బోధించే నేటి మౌఢ్య వ్యవస్థ
రోజు రోజుకు శూన్యం వైపు దేశ ప్రయాణం
పతనపు గమ్యం మధ్యయుగాల సమాజం
– శ్రామిక్