అణచివేత నుండి పుట్టుకొచ్చిన ధైర్యం

సంతోషి డియో… పెండ్లి ఆమె జీవితాన్ని ఓ విధంగా కోలుకోలేని దెబ్బతీసింది. కానీ కుంగిపోయి అక్కడే జీవచ్ఛవంలా మిగిలిపోవాలనుకోలేదు. అణచివేత నుండి పుట్టుకొచ్చిన ధైర్యంతో అడుగు బయట పెట్టింది. చదువు లేకపోయినా వచ్చిన పని చేసుకుంటూ తన బిడ్డకు మంచి భవిష్యత్‌ ఇవ్వాలనుకుంది. డ్రైవింగ్‌ చేస్తూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు పురుషులకు మాత్రమే పరిమితమైన వృత్తిని చేపట్టి లింగ వివక్షను బద్దలు కొట్టింది. కొయిడా గనుల నుండి ఇనుప ఖనిజాన్ని రవాణా చేసే వోల్వో ట్రక్కును నడుపు తోంది. తనకు, తన కుమార్తెకు గౌరవప్రదమైన జీవితాన్ని సృష్టించుకున్న ఆమె స్ఫూర్తిదాయక పరిచయం…
పదహారేండ్ల వయసులో సంతోషి డియో హర్యానాలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలోని వ్యక్తిని పెండ్లి చేసుకుంది. అప్పటి నుండి ఆమె జీవితం భయంకరమైన మలుపు తిరిగింది. అనునిత్యం వరకట్న వేధింపులు, గృహహింస అనుభవిస్తూ బాధాకరమైన జీవితాన్ని గడిపింది. చాలా కాలం తనని తాను మరిచిపోయి బాధను, కోపాన్ని పూర్తిగా అణిచిపెట్టుకుంది. కట్టేసి కొడితే పిల్లి కూడా ఏదో ఒకనాడు పులై తిరగబడుతుందని మనకు తెలుసు కదా! అలాగే సంతోషి కూడా. ఇక ఆ బాధల జీవితాన్ని భరించలేకపోయింది. పరిస్థితులకు తలవంచడానికి నిరాకరించింది. తిరిగి పోరాడాలని బలంగా నిర్ణయించుకుంది.
అద్భుతమైన కథ
రెండు దశాబ్దాల తర్వాత ఒడిషా రాష్ట్రంలో ఖనిజాలు ఎక్కువగా దొరికే కియోంఝర్‌ జిల్లా నుండి పాఠశాల చదువును మధ్యలోనే ఆపేసి వచ్చిన ఈమె జీవితం మలుపు తిరిగింది. ఇప్పుడు ఆమె ప్రయాణం స్థితిస్థాపకత, దృఢత్వం, సంకల్పంతో కూడిన అద్భుతమైన కథ. సంతోషి తన అత్తవారి ఇంటిని విడిచిపెట్టి తర్వాత మొదట తమిళనాడులోని స్పిన్నింగ్‌ మిల్లులో పనిచేసింది. ఆ పని చేస్తూనే ఆటో రిక్షా, బస్సు నడుపుతూ జీవనోపాధి కోసం తాను చేయగలిగినదంతా చేసింది. తన తల్లిదండ్రుల తొమ్మిది మంది సంతానంలో ఆరవ బిడ్డగా పుట్టిన ఈ ధైర్యవంతురాలు తర్వాత కాలంలో ఇనుప ఖనిజాల గనిలో డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరింది. సుందర్‌ఘర్‌ జిల్లాలోని కొయిడాలో ఇనుప ఖనిజం గనిలో ఒకప్పుడు పురుషులు మాత్రమే పని చేసేవారు. మహిళలకు అక్కడ ప్రవేశం లేదు. అలాంటి చోట సంతోషి పురుషులతో సమానంగా 40-టన్నుల వోల్వో ట్రక్కును నడుపుతూ తనలాంటి మహిళలకే కాదు, యువతకు, సమాజానికే స్ఫూర్తిగా నిలిచింది.
పుట్టింట్లోనూ అవమానాలు
గర్భవతిగా ఉన్న సంతోషి భర్త నుండి విడిపోయి సదర్‌ బ్లాక్‌, హండిభంగా పంచాయతీ, బాదముని గ్రామంలోని తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఆ కుటుంబం నుండి ఆమెకు మద్దతుకు బదులుగా అవమానాలు ఎదురయ్యాయి. అయినా అధైర్యపడకుండా తన సొంత మార్గాన్ని ఏర్పరచుకోవాలనుకుంది. స్పిన్నింగ్‌ మిల్లులో పని చేయడానికి తమిళనాడుకు వలస వెళ్లింది. ‘మా అత్తగారి ఇంటిని విడిచిపెట్టి వచ్చిన కొన్ని నెలల తర్వాత స్పిన్నింగ్‌ మిల్లులో పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడే 2012లో నాకు అమ్మాయి పుట్టింది. మూడేండ్లు అక్కడే కష్టపడి నా కూతురిని పెంచి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రతి పైసాను పొదుపు చేశాను’ అని ఆమె గుర్తుచేసుకుంది
కొత్త ఆలోచనలు, కలలు
చెన్నైలో ఆమె ఆటో రిక్షా నడుపుతున్న ఓ మహిళను చూసింది. అది ఆమెలో కొత్త ఆలోచలను, కలలను రేకెత్తించింది. ‘నాలాంటి ఓ మహిళ డ్రైవింగ్‌ చేయగలిగితే, నేనెందుకు చేయలేను’ అని ఆమె ఆలోచించుకుంది. ఇది ఆమె జీవితంలో ఒక గొప్ప మలుపుగా మారింది. 2015లో తన పొదుపు డబ్బుతో పాటు కొంత రుణం తీసుకొని ఆటో రిక్షా కొనుక్కుని తన సొంత జిల్లాకి తిరిగి వచ్చింది. కుమార్తెకు మరింత మంచి భవిష్యత్తు అందించడానికి 2017లో భువనేశ్వర్‌కు చేరుకుంది. అక్కడ తన బిడ్డను నగరంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించింది. ఆటో నడుపుకుంటూ ఆ తల్లీ బిడ్డలు నిరాడంబర మైన జీవితాన్ని గడిపేవారు. డ్రైవింగ్‌ చేస్తున్న ఆమె అప్పటి ఒడిషా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ సుబ్రతో బాగ్చితో పాటు అనేక మంది ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు పొందింది.
ఆశయాలు అక్కడితో ఆగలేదు
డ్రైవింగ్‌ చేయడంతో సంతోషి ఆశయాలు ఆగిపోలేదు. భారీ వాహనాలు నడపడంలో శిక్షణ పొందింది. 2021లో క్యాపిటల్‌ రీజియన్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (సిఆర్‌యుటి) నిర్వహిస్తున్న సిటీ బస్‌ సర్వీస్‌ అయిన మో బస్‌కు డ్రైవర్‌గా నియమితురాలయ్యింది. దాంతో ఆమె కష్టానికి ఫలితం దక్కింది. కొద్దిరోజులకే ఆమె ఒడిశాలోని ఒంటరి మహిళా బస్సుగా మహిళా సాధికారతకి ముఖ చిత్రంగా మారింది. అయితే ఊహించని విధంగా ఆమె విజయగాథ మరింత ముందుకు వెళ్లింది. ‘నేను రైల్వే స్టేషన్‌-పాత్రపాడు మార్గంలో మో బస్‌కు డ్రైవర్‌గా నియమించబడ్డాను. నేనే తొలి మహిళా బస్సు డ్రైవర్‌ కావడంతో స్థానిక మీడియా దాన్ని హైలైట్‌ చేసింది. ఒక నెల తర్వాత నా అధికారులు నన్ను ఉద్యోగం నుండి తొలగించారు. నా తప్పు ఏమిటో నేను అర్థం చేసుకోలేకపోయాను’ ఆమె చెప్పింది.
దృఢ సంకల్పంతో…
ఉద్యోగం పోవడంతో మళ్ళీ జీవితం ఆమె సంకల్పాన్ని పరీక్షించింది. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో రిక్షా డ్రైవింగ్‌కు తిరిగి వచ్చింది. ఆరు నెలల కిందట ఓ మైనింగ్‌ కంపెనీ సంతోషిలోని పట్టుదల, ధైర్యాన్ని గుర్తించింది. వోల్వో ట్రక్కును నడపడానికి ఆమెకు అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ఈ పని గతంలో పురుషులు మాత్రమే చేసేవారు. అలాంటి చోట ఆమె దృఢ సంకల్పంతో ఉద్యోగం సంపాదించి లింగ వివక్షను బద్దలు కొట్టింది. పట్టుదల ఉండాలే కానీ ఏ కలనైనా నిజం చేసుకొచ్చు అని రుజువు చేసి ఇప్పుడు నెలకు రూ.22,000 జీతం పొందుతోంది.
భువనేశ్వర్‌ టు న్యూఢిల్లీ
వృత్తి పరంగా ఎంత ఎదుగుతున్నా వ్యక్తిగత జీవితం మాత్రం ఆమెకు ఒక యుద్ధంగానే మిగిలిపోయింది. తాను విడిచిపెట్టాలనుకునే వివాహబంధంలో ఇరుక్కుపోయిన ఆమె భర్త నుండి విడాకుల కోసం దాఖలు చేసింది. కానీ అతను దానిని నిరాకరించాడు. 2017లో ఆమె తన భర్త నుండి విడాకులు ఇప్పించమనీ, తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాల్సిందిగా విన్నవించుకునేందుకు ప్రధానమంత్రిని కలవడానికి న్యూఢిల్లీ వరకు తన ఆటోరిక్షాలోనే వెళ్లింది. ‘నేను అతనిని కలవలేకపోయాను. కానీ నేను కేంద్ర మంత్రి జుయల్‌ ఓరమ్‌ను కలుసుకుని నా వినతిని సమర్పించాను’ అని ఆమె చెప్పింది. ప్రస్తుతం కూతురు హాస్టల్‌లో ఉండి చదువుకుంటుంది. సంతోషి తన సొంత గ్రామంలో సొంత ఇల్లు కట్టుకుంది. ఆమె ఇప్పటికీ అదనపు ఆదాయం కోసం ఉద్యోగానికి సెలవు రోజులలో ఆటో నడుపుతోంది.