హైదరాబాద్‌ ఐఐఐటీ వీసీ, రిజిస్ట్రార్‌కు కోర్టు ధిక్కార నోటీసు

నవతెలంగాణ-హైదరాబాద్‌
కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో జులై 14న జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని హైదరాబాద్‌లోని ఐఐఐటీ వీసీ, రిజిస్ట్రార్‌లకు కోర్టు ధిక్కార నోటీసును హైకోర్టు జారీ చేసింది. ముంబైకి చెందిన ధైర్య ఓంప్రకాశ్‌ ఝుంఝున్వాలా 2020లో ఐఐఐటీ, హైదరాబాద్‌లో బీటెక్‌ సీటు వస్తే రూ.1,60,000 కట్టి కాలేజీలో చేరారు. ఆ తర్వాత ముంబై ఐఐటీలో సీటు రావడంతో అక్కడ చేరారు. తాను కట్టిన ఫీజును తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా చెల్లించలేదని హైకోర్టును ఆశ్రయించారు. రూ.1,59,000లను 2020 నుంచి 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలనీ, కోర్టు ఖర్చుల కింద మరో రూ.10వేలు కూడా చెల్లించాలని ఈ ఏడాది ఏప్రిల్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు అమలు చేయలేదని ఓంప్రకాష్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను సోమవారం చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ విచారించింది. ప్రతివాదులైన కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, ఐఐఐటీ వీసీ, రిజిస్ట్రార్‌లు కోర్టు ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆదేశించింది. విచారణు జులై 14కి వాయిదా వేసింది.