దాయాదుల ఢీ దుబాయ్‌లో..

Diyadula Dhi in Dubai..– ఫిబ్రవరి 23న భారత్‌, పాక్‌ పోరు
– ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ
దుబాయ్‌: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ 2025 పీటముడి వీడింది. హైబ్రిడ్‌ మోడల్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అంగీకరించటంతో.. ఊహించినట్టుగా భారత్‌ మ్యాచులు యుఏఈ వేదికగా షెడ్యూల్‌ చేశారు. ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో చాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభం కానుండగా.. దాయాదులు భారత్‌, పాకిస్తాన్‌ గ్రూప్‌ దశలో ఫిబ్రవరి 23న తలపడనున్నాయి. ఈ మేరకు యుఏఈ మంత్రితో పీసీబీ చైర్మన్‌ మోషిన్‌ నక్వీ సమావేశం అయ్యారు. ఎనమిది జట్లు పోటీపడుతున్న చాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌ దశ, నాకౌట్‌ పద్దతిలో జరగనుంది. గ్రూప్‌-ఏలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భారత్‌, న్యూజిలాండ్‌ ఉన్నాయి. గ్రూప్‌-బిలో అఫ్గనిస్తాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా చోటు చేసుకున్నాయి. గ్రూప్‌ దశలో భారత్‌ ఆడే మూడు మ్యాచులు యుఏఈలో జరుగుతాయి. భారత్‌ నాకౌట్‌, ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. ఆ మ్యాచులు సైతం దుబారులోనే నిర్వహించనున్నారు. టోర్నమెంట్‌లో భారత్‌ తొలుత ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. న్యూజిలాండ్‌తో మార్చి 2న పోటీపడనుంది. భారత్‌ గ్రూప్‌ దశలో ఆడే మూడు మ్యాచులు దుబారులో జరుగనున్నాయి. మార్చి 4, మార్చి 5న సెమీఫైనల్స్‌ షెడ్యూల్‌ చేయగా.. రెండో సెమీస్‌కు మాత్రమే రిజర్వ్‌ డే సదుపాయం కల్పించారు. మార్చి 9న టైటిల్‌ పోరు జరుగుతుంది. షెడ్యూల్‌పై ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తవగా… త్వరలోనే ఐసీసీ, పీసీబీ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేయనున్నాయి.