కప్పేస్తున్న పొగ మంచు

కప్పేస్తున్న పొగ మంచు–  విమానయానానికి అంతరాయం
–  యూపీలో 10 వాహనాలు ఢ
న్యూఢిల్లీ : ఉత్తరభారతాన్ని చలి పులి వణికిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దేశరాజధాని ప్రాంతంలో సోమవారం ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి. దీంతోపాటు దట్టంగా పొగ కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాదిలో అనేక ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకి పడిపోయింది. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం, అమృత్‌సర్‌, ఆగ్రా, గ్వాలియర్‌, ప్రయాగ్‌రాజ్‌, జైసల్మేర్‌ విమానాశ్రయాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర ప్రభావం పడింది. దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే దట్టమైన పొగ మంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీకి సుమారు 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాపూర్‌లోని హఫీజ్‌పూర్‌ కొత్వాలి ప్రాంతంలో సుమారు 10 వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢ కొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హపూర్‌-బులంద్‌షహర్‌ హైవేపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పొగ మంచుకారణంగా సుమారు 10 వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం నేపథ్యంలో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో దెబ్బతిన్న కార్లను క్రేన్‌ సాయంతో పోలీసులు అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.