– హాజరైన సీఎం రేవంత్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సీఎస్, మంత్రులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. అనంతరం గవర్నర్‌తో సీఎం రేవంత్ ఏకాంతంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక తదితర అంశాలపై సీఎం ఆయనకు వివరించినట్టు సమాచారం. రాష్ట్రానికి మూడో గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ వ్యవహరించనున్నారు.
ముగ్గురు గవర్నర్లు తమిళులే!
తెలంగాణ ఆవిర్బావం నుంచ ఇప్పటి వరకు రాష్ట్రానికి ముగ్గురు గవర్నర్లుగా నియమితులయ్యారు. వీరందరూ తమిళనాడుకు చెందిన వారే కావడం గమనార్హం. 2014 నుంచి 2019 సెప్టెంబరు 7 వరకు ఈఎస్‌ఎల్ నరసింహన్ మొదటి గవర్నర్‌గా పని చేశారు. పదేండ్ల తెలంగాణ చరిత్రలో ఐదేండ్లకు పైగా నరసింహన్ సేవలందించారు. ఆయన తర్వాత 2019 సెప్టెంబరు 8 నుంచి సోమవారం వరకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాధాకృష్ణన్‌కు కేంద్రం తెలంగాణ అదనపు బాధ్యతలను అప్పగించింది. రాష్ట్రంతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
రెండు సార్లు ఎంపీగా ఎన్నిక
తమిళనాడులోని తిరువూరులో 1957 మే 4న జన్మించిన రాధాకృష్ణన్ రాజకీయ జీవితం బీజేపీ నుంచి ప్రారంభమైంది. కోయంబత్తూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన 1998, 1999లో రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2014,2019 ఎన్నికల్లో ఆదే స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనతంరం తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులయ్యారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మెన్‌గా విధులు నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి జార్ఖండ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు.