ఆశాలపై కేటీఆర్‌ వ్యాఖ్యలకు సీపీఐ ఖండన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆశా వర్కర్‌ సంఘాలను ఉద్దేశించి పనికిమాలిన వాళ్లు, పనికిమాలిన సంఘాలంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ప్రజాసమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సూచించారు. లేనిపక్షంలో కారణం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సందు చూసుకుని ప్రభుత్వం మెడపై కత్తి పెడతారా?అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించడం సరైంది కాదని తెలిపారు. ఎన్నికల కోసమే తాయిలాలు ప్రకటిస్తూ, శంకుస్థాపనలు చేస్తున్నపుడు సమస్యలపై ఆశాలు ఆందోళన చేయడంలో తప్పేమిటని ప్రశ్నించారు. గన్‌మెన్‌పై హోంమంత్రి మహమూద్‌ అలీ చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
ఎమ్మెల్యేలకు అనుమతి లేని సచివాలయం ఎందుకు : చాడ
సచివాలయంలోకి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను అనుమతివ్వని దాని కి కొత్తగా కట్టడం ఎందుకని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిం చారు. ‘మా ప్రభుత్వం మా ఇష్టం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది’అని విమర్శించారు. సచివాలయంలోకి పాత పద్ధతి ప్రకారమే అనుమతించాలని కోరారు. సచివాలయంలోకి ఎమ్మెల్యేల అనుమతిపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. గన్‌మెన్‌పై హోంమంత్రి మహమూద్‌ అలీ చేయిచేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించారని విమర్శించారు. ఆ గన్‌మెన్‌కు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.