– బీఆర్‌ఎస్, కాంగ్రెస్ డబ్బులను నమ్ముకున్నరు
– ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే బీజేపీని ఓడించాలి: త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్
– పోరాడేవాళ్లకు ఓటు వేయండి : తమ్మినేని
– కూసుమంచిలో రోడ్‌షో, బహిరంగ సభ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ డబ్బులను నమ్ముకు న్నాయి.. ఓట్లను కూరగాయల్లా కొంటున్నరు.. సీపీఐ(ఎం) మాత్రం ప్రజలను నమ్ముకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ అన్నారు. ఓట్లను కొనుక్కునే వాళ్లను ఓడించి మీ కోసం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి రోడ్‌షో, బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ విలువలను హరించివేస్తున్న బీజేపీని ఐదు రాష్ట్రాల్లో ఓడించి తీరాలన్నారు. రైతులు, కూలీలను కాంగ్రెస్ తన పాలనలో విస్మరించిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే గత పరిస్థితులు రావని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ హామీలను నిలుపుకోలేదన్నారు. అటువంటి బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలని, పదేండ్లుగా ఏమి చేసిందని ప్రశ్నించారు. ఇండ్ల పట్టాలు, నిరుద్యోగ సమస్య, కేజీ టూ పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమైనట్టు అన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన, ప్రజాపోరాటాలు చేసిన అనుభవం తమ్మినేనికి ఉందన్నారు. ఈ దేశ, రాష్ట్ర ప్రగతి, సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడే శక్తి ఉన్న నాయకులు తమ్మినేని అన్నారు. అలాంటి ప్రజా నాయకున్ని అసెంబ్లీకి పంపించాలని ఓటర్లను కోరారు. డబ్బులిచ్చే వాళ్లకు కాకుండా జనం కోసం పోరాడే వాళ్లకు ఓట్లు వేస్తే అసెంబ్లీ వెలుపులా.. లోపలా ప్రజల తరఫున పోరాటం చేస్తారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకే పడవలో వెళ్తున్నాయని, ఆ పడవ మనది కాదు.. ఆ పడవలో సాధారణ ప్రజలుండరని చెప్పారు.
పోరాడేవాళ్లకే ఓటు వేయండి: తమ్మినేని
పోరాడే వాళ్లకే మీ ఓటు వేయాలని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి తమ్మినేని వీరభద్రం కోరారు. 2004లో సింగిల్‌గా ఖమ్మంలో గెలిచిందన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇస్తున్న డబ్బులకంటే.. ప్రజా పోరాటాలు చేసి మీ సమస్యలను పరిష్కరించడం ద్వారా ఎంతో సేవ చేశామని అన్నారు. పాలేరుకు సీతారామ, భక్తరామదాసు తెచ్చింది తుమ్మల కాదన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు సాధనకు 2,600 కి.మీ తాను పాదయాత్ర చేశానని, తద్వారా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ స్వయంగా తనను తీసుకెళ్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత నిధుల కోసం కూడా పాదయాత్ర ప్రారంభించి రూ.600 కోట్లు సాధించానన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన జలగం వెంగళరావు, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న శీలం సిద్ధారెడ్డిల్లో ఎవరికీ ఆ ఆలోచన రాలేదన్నారు.
తెలంగాణను కాపాడేది ఎర్రజెండా మాత్రమేనని సీపీఐ(ఎం) జాతీయ నాయకులు బి.వెంకట్ అన్నారు. భూస్వాముల కోరలు పీకే కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బజ్జూరి రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, బుగ్గవీటి సరళ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండల కార్య దర్శులు కేవీ రెడ్డి, కొమ్ము శ్రీను, నాయకులు బషీరుద్దీన్, గోపి, వెంకన్న పాల్గొన్నారు.