29న సింగరేణి రక్షణకు సీపీఐ(ఎం) బస్సు యాత్ర

29న సింగరేణి రక్షణకు సీపీఐ(ఎం) బస్సు యాత్ర– హాజరు కానున్న రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-మంచిర్యాల
సింగరేణి బొగ్గు బావుల పరిరక్షణకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జూలై 29 నుంచి బెల్లంపల్లి నుంచి బస్సు యాత్రను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభత్రం ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య తెలిపారు. శుక్రవారం పట్టణంలోని చార్వాక హాల్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆశయ్య మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం వేస్తోందని, దేశ సహజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించబోతుందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలోని శ్రావణ పల్లి బొగ్గు బ్లాకు కూడా వేలంలో పెట్టిందని, సింగరేణిని కూడా ప్రయివేటు సంస్థలతో పోటీ పడేలా చేయల్సింది పోయి కార్పోరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు చూస్తోందని విమర్శించారు. బీజేపీ విధానాలను భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. తెలంగాణలో బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించి, బొగ్గు గనుల వేలం ఆపాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహిస్తున్నామన్నారు. బొగ్గు బ్లాకుల ప్రయివేటు సంస్థలకు అప్పజెప్తే రానున్న కాలంలో సింగరేణి బలహీనపడి మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని దీంతో సింగరేణి ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. సింగరేణి గనులు తెలంగాణలో కొంగు బంగారం, కార్మికుల కష్టంతో సిరులు కురిపిస్తుందని, 76 వేల మంది పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు నిరంతరం సింగరేణిలో కష్టపడుతున్నారన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చౌక ధరకే బొగ్గు సరఫరా చేస్తూ తక్కువ ఖర్చుతో కరెంట్‌ ఉత్పత్తికి తోడ్పడుతున్నదని, ఫలితంగా ప్రజలకు విద్యుత్‌ భారం తగ్గిస్తున్నదని అన్నారు. సింగరేణి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో విద్య, వైద్యం, రోడ్లు, మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలకు నిధులు ఖర్చు పెడుతోందని బంగారు గుడ్లు పెడుతున్న బాతు లాంటి సింగరేణిని కార్పొరేట్లకు నైవేద్యం పెట్టాలని చూస్తున్న మోడీ రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల సమయంలో బీజేపీ 8 మంది ఎంపీలు, 8 మంది శాసనసభ్యులను గెలిపించారని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి గెలుపొంది బొగ్గు గనుల శాఖ మంత్రిగా నియమితులైన కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ కేంద్రంగా బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రారంభించడం సిగ్గుచేటు అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా కేంద్రంతో పోరాడకుండా, సింగరేణికి గనులు దక్కకుండా చేసిందని తెలిపారు. ఇప్పటికే కోయగూడెం బ్లాక్‌ 3, సత్తుపల్లి బ్లాక్‌ 3 గనులను ప్రయివేటు కంపెనీలు దక్కించుకున్నాయని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే శ్రావణపల్లి బొగ్గు బ్లాకు ను సింగరేణికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ను కాపాడే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని లేని యెడల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. అందుకోసం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సింగరేణి వ్యాప్తంగా సింగరేణి పరిరక్షణ యాత్ర పేరిట బస్సు యాత్ర చేపట్టిందని ఈ యాత్రలో వామపక్ష పార్టీలు, ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, సామాజిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో దుర్గం సిద్ధార్థ, రాంమూర్తి, సమత సైనిక్‌ దల్‌ రాష్ట్ర నాయకులు, జాడి దేవరాజ్‌ సీపీఐ(ఎం ఎల్‌) మాస్‌ లైన్‌ జిల్లా కార్యదర్శి. కామిల్ల జయరావ్‌ ఐఆర్సిపి రాష్ట్ర నాయకులు ముడిమడుగుల బ్రహ్మయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాతిపెల్లి నగేష్‌, జిల్లా నాయకులు రంగు రాజేశం ఉద్యోగ సంఘాల నాయకులు, చందు పాల్గొన్నారు.