నకిరేకల్ నియోజకవర్గ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు ఈనెల 10న నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల తెలిపారు. బుధవారం పట్టణంలోని నర్ర రాఘవరెడ్డి భవనంలో ఆ పార్టీ పట్టణ, మండల కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 10వ తేదీన జరిగే నామినేషన్ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, యువకులు, పార్టీ అభిమానులు, మేధావులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. నామినేషన్ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు, పార్టీ మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, పట్టణ కార్యదర్శి ఒంటెపాక వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య, కేతపల్లి మండల కార్యదర్శి లూ ర్దు మారయ్య, సీనియర్ నాయకులు యానాల కృష్ణారెడ్డి, బాచుపల్లి ప్రకాష్ రావు, రాజు, ఆదిమల్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.