కేరళ గవర్నర్‌ తీరుతో విభేదించిన సీపీఐ(ఎం)

కేరళ గవర్నర్‌ తీరుతో విభేదించిన సీపీఐ(ఎం)– రాజ్యాంగ స్థాయికి తగినట్లుగా వ్యవహరించలేదంటూ విమర్శ
తిరువనంతపురం : వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ విధానాలను తెలియచేస్తూ సాగాల్సిన ప్రనంగాన్ని బాధ్యతారాహిత్యమైన, అసమర్ధమైన రీతిలో చేయడం ద్వారా కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తన స్థాయికి తగినట్లు కాకుండా దిగజారి వ్యవహరించారని సిపిఎం విమర్శించింది. ఇక్కడ ఎకెజి సెంటర్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్‌ విలేకర్లతో మాట్లాడుతూ, జనవరి 25న అసెంబ్లీలో గవర్నర్‌ ఖాన్‌ తన రాజ్యాంగ విధుల పట్ల నిర్లక్ష్యంగా, పట్టీపట్టని రీతిలో వ్యవహరించారని విమర్శించారు. ”సహకార సమాఖ్యవాదం ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్న పేరాగ్రాఫ్‌ను చదవడం ద్వారా ప్రభుత్వ విధాన ప్రసంగంలోని సారాన్ని ఖాన్‌ ఆచరణాత్మక రీతిలో వెల్లడించారు. అయితే, సభలో గవర్నర్‌ వ్యవహార శైలి చాలా అవమానకరంగా వుంది. ఆయన ఉన్నత స్థాయికి తగినట్లుగా లేదు.” అని గోవిందన్‌ పేర్కొన్నారు. గవర్నర్‌ వివాదాస్పద రీతిలో విధాన ప్రసంగాన్ని చేయడంపై విమర్శలు చేయడం ద్వారా ఖాన్‌ను నిర్బంధించాలని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం భావిస్తోందనడాన్ని గోవిందన్‌ తోసిపుచ్చారు. ”గవర్నర్‌ తన సంప్రదాయ ప్రసంగంలో కోత పెడతారని తొలుత మేం ఊహించాం. కానీ ఆయన రిపబ్లిక్‌ డే ప్రసంగాన్ని చేసి, శుక్రవారం రాజధానిలో జరిగిన పరేడ్‌కు కూడా హాజరయ్యారని తెలిపారు.
మైనారిటీలపై దాడులు
ఇటీవల రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత దేశంలో పలు చోట్ల మత ఘర్షణలు జరిగినట్లు వార్తలందుతున్నాయని గోవిందన్‌ చెప్పారు. యుపి, గుజరాత్‌, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, కర్ణాటక, తెలంగాల్లో ముస్లింలు, క్రైస్తవులపై దాడులు చేసేలా సంఘపరివార్‌ ఉద్దేశ్యపూర్వకంగా ప్రోత్సహి స్తోందని ఆయన విమర్శించారు. హిందూ ఓట్లను రాబట్టుకునే లక్ష్యంతో మతసామరస్యతను దెబ్బ తీసేలా, మైనారిటీలను చెడ్డగా చిత్రీకరించేలా చేస్తోం దని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అధికారులు మైనారిటీల ఇళ్లను ధ్వంసం చేస్తూ, చర్చిలు, మసీదులను ధ్వంసం చేసేలా సంఘపరివార్‌ శక్తులు రెచ్చగొడుతున్నాయని వార్తలు వస్తున్నాయన్నారు.
రాష్ట్ర స్థాయిలో బిజెపి వ్యతిరేక ఓట్ల సంఘటితం
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రంలో మూడోసారి ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడకుండా నివారించేందుకు 63శాతం బిజెపి వ్యతిరేక ఓట్లను సంఘటితం చేయాల్సిన అవసరం వుందని ఆయన చెప్పారు. ప్రతి రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా భావించి, బిజెపి వ్యతిరేక అభ్యర్ధుల రాజకీయ సంబంధాలు లేదా వ్యక్తిగత వివరాలతో నిమిత్తం లేకుండా వారికి మద్దతివ్వాలని ఇండియా బ్లాక్‌ పక్షాలకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది.