ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి యాదయ్యను గెలిపించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి ప్రచార నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ గెలుపుతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలకు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీని రావాలంటే సీపీఐ(ఎం) గెలవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్యదర్శి సీహెచ్‌ ఎల్లేష మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వంలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. కమ్యూనిస్టుల డిమాండ్‌ మేరకే యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కానీ బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు అధికారం చేపట్టిన తర్వాత మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఉపాధి హామీని తొలగించాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని నేటికీ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌, బీజేపీ పట్టణ ప్రాంతాల్లోని పేదలను పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని రోడ్ల వ్యవస్థ అద్వానంగా మారిందని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని వార్డుల్లో మాత్రం హడావిడి పనులు చేసి చేతులు దులుపుకున్నారని చెప్పారు.