ప్రజాప్రయోజనాల కోసం సీపీఐ(ఎం) పోరాటం

ప్రజాప్రయోజనాల కోసం
సీపీఐ(ఎం) పోరాటం– పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
– ప్రజాస్వామ్య విలువలు ఉండాలంటే కమ్యూనిస్టులు గెలవాలి
నవతెలంగాణ-హయత్‌ నగర్‌
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు గెలిస్తే వ్యాపారాలు చేస్తారని, అదే సీపీఐ(ఎం) భువనగిరి అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపిస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాటం చేస్తాడని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. సెటిలర్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని ఎం ఈ రెడ్డి గార్డెన్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో బీజేపీ పప్పులు ఉడుకుతాయి కానీ తెలంగాణలో మాత్రం దాని ఆటలు సాగవని అన్నారు. ఇండియా కూటమిని గెలిపిస్తేనే బీజేపీ అహంకారం తగ్గుతుందని, సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రాముడి పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజా సమస్యలు పరిష్కారం కావని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని గెలిపించాలని, అందుకు జనం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. మోడీ గురించి సామాన్య ప్రజలు మాట్లాడితే ఒక గొప్ప కానీ, చిన జీయర్‌ స్వామి లాంటి వ్యక్తులు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. మోడీ పాలనలో నిరుద్యోగుల సమస్య, ధరల పెరుగుదల, చమురు పెరుగుదల, పేదలపై దాడులు పెరిగాయని అన్నారు. సీపీఐ(ఎం)అభ్యర్థి ఎండీ జంగీర్‌ మాట్లాడుతూ.. తాను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చానన్నారు. మిగతా పార్టీ అభ్యర్థుల లాగా తాను వ్యాపారాలు చేయడం లేదని, తనను గెలిపిస్తే ప్రజా సేవకు అంకితం అవుతానన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయటానికి వచ్చానని, ఒక్క అవకాశం కమ్యూనిస్టులకు ఇచ్చి పార్లమెంట్‌కు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌ వెస్లీ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగాళ్ల భాస్కర్‌, నాయకులు బొందల చంద్రారెడ్డి, స్కైలాబ్‌బాబు, కీసరి నర్సిరెడ్డి, వెంకట్‌ రమణ, కట్ట నర్సింహ, విజరు, ఆనంద్‌ పాల్గొన్నారు.