– మూడు స్థానాలలో పేర్లు ఖరారు చేసిన రాష్ట్ర కమిటీ
– రెండో జాబితాలో మిగిలిన స్థానాల ఖరారు
– 8న నామినేషన్ వేయనున్న జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకుగాను పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆదివారం ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్రవ్యాప్తంగా 14 స్థానాలు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అందులో ఉమ్మడినల్లగొండ జిల్లా నుండి మూడు స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించారు.మరికొన్ని స్థానాలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సీపీఐ(ఎం) రెండో జాబితాలో ఆ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.ఇప్పటివరకు కాంగ్రెస్‌తో పొత్తులపై చర్చించిన సీపీఐ(ఎం) పొత్తులు కొలిక్కి రాకపోవడంతో ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైంది.కాంగ్రెస్ ఇస్తామన్న రెండు స్థానాలపై స్పష్టత ఇవ్వడంలో కాలయాపన చేస్తుండడతో ఒంటరిగా పోటీ చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించి అభ్యర్థులను ప్రకటించింది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తున్న సీపీఐ(ఎం) ఎన్నికల్లో గెలిపించి చట్టసభలకు పంపించాలని ఆ పార్టీ అభ్యర్థులు విస్తత ప్రచారం చేయనున్నారు. ఆయా నియోజకవర్గాలలో సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు.
ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాలలో పేర్లు ఖరారు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి జాబితాలో మూడు స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నకిరేకల్ నుంచి బొజ్జ చినవెంకులు, భువనగిరి నుంచి కొండమడుగు నర్సింహ పేర్లను ఖరారు చేశారు.నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లోనూ పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమైంది.ఈ స్థానంలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను రెండో జాబితాలో ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు సమాచారం.
8న జూలకంటి నామినేషన్
ఈనెల 8న మిర్యాలగూడ నుంచి పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.నామినేషన్ వేస్తున్న సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు పదివేల మంది జన సమీకరణతో పెద్దఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేయనున్నట్టు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.దీనికోసం ఇప్పటికే నియోజవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.అదేవిధంగా నకిరేకల్, భువనగిరి అభ్యర్థులు 8 లేదా 9వ తేదీలలో నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తుంది.