సికార్‌లో సీపీఐ(ఎం) జెండా

సికార్‌లో సీపీఐ(ఎం) జెండా– వామపక్షాలకు బలమైన కేంద్రం
– ఇండియా ఫోరం తరఫున సీపీఐ(ఎం) అభ్యర్థి అమ్రారామ్‌
జె.జగదీష్‌, నవతెలంగాణ
‘సుత్తి కొడవలి నక్షత్రం… మా ఎన్నికల గుర్తు’, ఇండియా ఫోరం అభ్యర్థి అమ్రారామ్‌కు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ రాజస్థాన్‌లోని సికార్‌ లోక్‌సభ నియోజకవర్గం అంతటా ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది.
ఆరావళి కొండల సరిహద్దులో ఉన్న సికార్‌ మండలం పాత కోటలు, హవేలీలతో నిండి ఉంది. పదేండ్లుగా సికార్‌ బీజేపీకి కంచుకోటగా ఉంది. స్వామి సుమేదానంద సరస్వతి, ఆర్యసమాజ్‌ సన్యాసి, 2014, 2019లో గెలిచారు. హర్యానాకు చెందిన సుమేదానంద ఎంపీగా పూర్తిగా విఫలమయ్యారనే విషయాన్ని సికార్‌లోని బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కానీ మోడీ, అమిత్‌ షా ధ్వయం సుమేదానందాని మళ్లీ బరిలోకి దింపింది.
సుమేదానంద, సంఫ్‌ు పరివార్‌ కోటలను బద్దలు కొట్టడానికి ఇండియా ఫోరం రైతు నాయకుడు అమ్రారామ్‌కు బాధ్యత అప్పగించింది. అమ్రారామ్‌ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి. కిసాన్‌ సభ అఖిల భారత ఉపాధ్యక్షుడు. సికార్‌లోని దోడ్‌, దాతారమ్‌గఢ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సికార్‌ లోక్‌సభ నియోజకవర్గానికి 2006లో జరిగిన ముక్కోణపు పోటీలో ఆయనకు 1.62 లక్షల ఓట్లు వచ్చాయి.
రైతు నేత అమ్రారామ్‌ లోక్‌సభ నియోజకవర్గ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వసుంధర రాజే హయాంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో ఏఐకేఎస్‌ నాయకత్వంలో అమ్రారామ్‌ నేతృత్వంలో జరిగిన దిగ్గజ పోరాటం రాష్ట్రాన్ని కుదిపేసింది. సచివాలయం చుట్టూ రెండు వారాలుగా సాగిన ఆందోళనకు బీజేపీ ప్రభుత్వం మోకరిల్లాల్సి వచ్చింది. కరెంటు రేట్లు, పంటల బీమా, వ్యవసాయానికి నీరు వంటి పలు డిమాండ్లను లేవనెత్తుతూ అమ్రారామ్‌ సికార్‌, సమీప ప్రాంతాల్లో అనేక ఆందోళనలకు నాయకత్వం వహించారు. రాజస్థాన్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి కూడా అమ్రారామ్‌ నాయకత్వం వహించారు.
సికార్‌లో బీజేపీ ఎన్నికల కమిటీకి ఇన్‌చార్జ్‌గా ఉన్న మనోజ్‌ సైనీ అమ్రారామ్‌ బలమైన ప్రత్యర్థి అని బహిరంగంగా అంగీకరించారు. ఆయన గొప్ప వ్యక్తి అని అన్నారు. ”సిట్టింగ్‌ ఎంపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ ఇక్కడ ఓటు బీజేపీకి, మోడీకి వేయాలి. ఎంపీకి కాదు. అభ్యర్థి సమస్య కాదు” అని అన్నారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కిషన్‌ పారిఖ్‌ మాట్లాడుతూ సికార్‌లో కొడవలి గుర్తుకు మంచి గుర్తింపు ఉందన్నారు. అమ్రారామ్‌ ప్రత్యర్థులు కూడా గుర్తించే వ్యక్తిత్వం ఉన్నవారు. బీజేపీ సికార్‌ నుంచి పారిపోతుందని పారిఖ్‌ అన్నారు.
నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికార్‌లోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఐదింటిని కాంగ్రెస్‌ గెలుచుకుంది. సీపీఐ(ఎం) దోడ్‌ నియోజకవర్గంలో రెండో స్థానంలో, దాతారంగఢ్‌లో మూడో స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా ఫోరంలో అన్ని పార్టీలు 1.38 లక్షలకు పైగా ఓట్లను సాధించాయి. సికార్‌లోని 1.5 లక్షల మైనారిటీ ఓట్లు కూడా ప్రభావం చూపనున్నాయి.
సికార్‌తో నిత్యం టచ్‌లోనే..
సికార్‌లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన నీమ్‌కటనాలోని హేమ్‌రాజ్‌పురాలో అభ్యర్థి పర్యటన సందర్భంగా అమ్రారామ్‌ మాట్లాడారు. నీమ్‌కటనా ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు సురేష్‌ మోడీ ఆయనతోనే ఉన్నారు. ఇండియా ఫోరం అభ్యర్థిని సికార్‌ ప్రజలు ఉత్సాహంగా స్వీకరిస్తున్నారని అమ్రారామ్‌ అన్నారు. ”సిట్టింగ్‌ ఎంపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. సికార్‌లో పర్యటించడమే చాలా అరుదు. సికార్‌ ఆయన యాక్షన్‌ ఫీల్డ్‌. అది ఓటర్లకు కూడా తెలుసు” అని అన్నారు. రైతులు పూర్తి స్థాయిలో తమతోనే ఉన్నారు. రైతాంగ సమస్యలు, నియోజకవర్గంలో అభివృద్ధి లేమి, అగ్నివీర్‌ సహా యువత సమస్యలు, ధరల పెరుగుదల, అవినీతి, బీజేపీ నియంతృత్వం వంటి సమస్యలపై అమ్రారామ్‌ దృష్టి సారించారు. కాంగ్రెస్‌తో సహా ఇండియా ఫోరంలోని ఇతర పార్టీల కార్యకర్తలు ఉత్సాహంగా భాగస్వామ్యం అవుతున్నారు. బీజేపీని ఓడించేందుకు సికార్‌లో ఇండియా ఫోరం ఏకమైందని అమ్రారామ్‌ అన్నారు.
సికార్‌లో ఇండియా ఫోరం ఐక్యంగా ఉందని సురేశ్‌ మోడీ అన్నారు. అమ్రారామ్‌ నామినేషన్‌ దాఖలకు అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌, పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ తోడిసా హాజరయ్యారు. తొడిసా సికార్‌లోని లక్ష్మణ్‌గఢ్‌ నుంచి ఎమ్మెల్యే. ప్రచార కార్యక్రమాలను ఆయన సమన్వయం చేస్తున్నారు. రాజస్థాన్‌లో సీపీఐ(ఎం), రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ, భారత్‌ ఆదివాసీ పార్టీలతో కూడిన ఫోరం బీజేపీ ఆశ్చర్యానికి గురి చేసింది. చురు, బికనీర్‌ వంటి నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం)తో కలిసి ఉండడం వల్ల కాంగ్రెస్‌కు లాభం చేకూరుతుందని మోడీ అన్నారు.