– ఆరు గ్యారంటీలపై మాట్లాడే వారికే గ్యారంటీ లేదు
– పోడు పట్టాల పంపిణీలో మోసం చేసిన బీఆర్‌ఎస్
– భూక్య వీరభద్రంకు ఓటేసీ.. అసెంబ్లీకి పంపించండి
– ఊసరవెల్లి రాజకీయ నాయకులను ఓడించండి :సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్
నవతెలంగాణ-వైరాటౌన్/కొణిజర్ల
ఊసరవెల్లిలా రంగులు మార్చే రాజకీయ నాయకుల మాటలు నమ్మొద్దని, వారికి డబ్బు మాత్రమే ఉందని, ఒక సిద్ధాంతం, నీతి, నిజాయితీ లేదని, అలాంటి వారిని ఓడించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ పిలుపునిచ్చారు. ఎర్రజెండా ఎత్తి పోరాటాలు చేయడంలోనే కాదు, బ్యాలెట్ పేపర్‌లో కూడా నెంబర్ వన్‌గా ఉన్న భూక్య వీరభద్రం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తిచేశారు. సీపీఐ(ఎం) వైరా నియోజకవర్గం అభ్యర్థి భూక్యా వీరభద్రం విజయాన్ని కాంక్షిస్తూ శనివారం బృందాకరత్ వైరా, కొణిజర్ల మండల కేంద్రాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా రింగ్ రోడ్డు వద్ద జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడారు. సీపీఐ(ఎం)ది డబ్బు యాత్ర కాదని, తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ(ఎం) ప్రతినిధి ఉండాలనే ఒకే ఒక సందేశంతో చేస్తున్న పోరాటాల యాత్రని తెలిపారు. అటవీ హక్కుల చట్టం కోసం పోరాడింది సీపీఐ(ఎం) మాత్రమేనన్నారు. ఆదివాసీల పోడు భూముల కోసం భూక్యా వీరభద్రం అనేక ఉద్యమాలు నిర్వహించి ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు ఈ పోరాట చరిత్ర లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి పోడుపట్టాలు ఇచ్చే ఉద్దేశం లేదని, అటవీ భూములను అదానీ, అంబానీలకు కట్టబెట్టాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 20వేల మందికి పోడు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా.. 4వేల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి రైతులకు సాగునీరు అందించాలని తమ్మినేని వీరభద్రం మహాజన పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశం బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉంటే ఇప్పటివరకు సీతారామ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రయివేటు పరం చేస్తోందని తెలిపారు. బీజేపీకి రాజ్యాంగం పట్ల నమ్మకం లేదని, మతాన్ని నమ్ముకుందని, ప్రజలను విభజించడానికి మతాన్ని వాడుతున్నారన్నారు. 6 గ్యారంటీలు మాట్లాడే వారికే గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు పోరాటాల చరిత్ర ఉన్నదని, ఎర్రజెండా చేతబట్టుకొని ప్రజలతో మమేకమై తిరుగుతూ ప్రజలతో కలిసి పోయి, ప్రజల మధ్య ఒకడిగా ఉంటూ పోరాటాలు నడుపుతున్న భూక్యా వీరభద్రంను గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు పారుపల్లి ఝాన్సీ, తాళ్లపల్లి కృష్ణ, మెరుగు సత్యనారాయణ, సుంకర సుధాకర్, ప్రముఖ విద్యావేత్త ఐవీ రామణారావు, కొణిజర్ల, జూలూరుపాడు మండల కార్యదర్శులు చెరుకుపల్లి కుటుంబరావు, యాసా నరేష్ పాల్గొన్నారు.