– ప్రజలందరి సంక్షేమమే కమ్యూనిస్టుల లక్ష్యం : పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
– సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని పిలుపు
– ఎర్ర జెండాల రెపరెపలతో ఎరుపెక్కిన పటాన్‌చెరు
– మల్లికార్జున్ గెలుపునకు వేలాది బైక్‌లతో భారీ ర్యాలీ
ప్రజలు, కార్మికుల హక్కుల కోసం చట్ట సభల్లో నిలదీసేందుకు సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. పటాన్‌చెరులో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్, రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్లు కావాలా..? కార్మిక, శ్రామిక ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టులు కావాలో.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
నవతెలంగాన-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి జె.మల్లికార్జున్ గెలుపును కాంక్షిస్తూ ఆదివారం బీరంగూడ నుంచి రుద్రారం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ఎర్రజెండాలు చేతబూని దండుగా కదం తొక్కారు. పటాన్‌చెరు ఎరుపుమయమైంది. ఐదు గంటల పాటు బైక్ ర్యాలీ కొనసాగింది. బైక్ ర్యాలీని ప్రారంభించిన రాఘవులు అనంతరం మాట్లాడారు.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంకేమం కోసం పాటుపడేది కమ్యూనిస్టులు మాత్రమేనని చెప్పారు. ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై శాసన సభలో గళమెత్తే అవకాశం వచ్చిందని, సీపీఐ(ఎం) అభ్యర్థిని ఆదరించి.. ఓట్లేసి ఆశిర్వదించాలని కోరారు. యాజమాన్యాల మేలు కోరే పాలకులు కార్మికులకు ఆపద వస్తే ఎలా ముందుకు వస్తారని ప్రశ్నించారు. పారిశ్రామిక ప్రాంతంగా విస్తరించినా నియోజకవర్గంలో కార్మికులు, ప్రజలకు కనీస సౌకర్యాలను మెరుగుపర్చేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కృషి చేయలేదన్నారు.
పటాన్‌చెరు ప్రాంతంలో పాలకులు అప్రమత్తంగా లేకపోవడం వల్లే కాలుష్యం కోరలు చాచి ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, మరి ప్రతి ఇంట్లో ఆర్వో వాటర్ మిషన్లు ఎందుకు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ విధానాలు ఒక్కటేనని విమర్శించారు. ఒకరు చేసిన తప్పులను మరొకరు ఎత్తిచూపుకోవడం వల్ల ప్రజలకు జరిగే మేలేముందన్నారు. కార్మికులు, పేదలు, శ్రామికుల పక్షాన ఎళ్ల వేలలా నిలిచేది ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. పటాన్‌చెరులో ధన బలం.. సేవా బలం మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి మీ కోసం పోరాడే అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఐదేండ్ల భవిష్యత్‌ను కాపాడుకునేందుకు డబ్బుకు కాకుండా సమస్యలపై పనిచేసే సీపీఐ(ఎం)కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
కార్మికుల గుండె చప్పుడు ఎర్రజెండా..
కార్మికుల పక్షాన పోరాడేది ఒక్క ఎర్రజెండా మాత్రమేనని, సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లికార్జున్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు ఓటర్లను కోరారు. పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనాల కోసం పోరాడిన పార్టీ సీపీఐ(ఎం) ఒక్కటేనని చెప్పారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు యాజమాన్యాల ప్రయోజనాల కోసం పనిచేస్తారు తప్ప కార్మికుల వేతనాలు, సమస్యల గురించి పట్టించుకోరన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లెవ్వరూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, అభ్యర్థి జె.మల్లికార్జున్, జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య, నాయకులు కె.రాజయ్య, బీరం మల్లేశం, అతిమేల మాణిక్, జి.సాయిలు, నాయిని నర్సింహ్మరెడ్డి, రామచంద్రం, నాగేశ్వర్‌రావు, ప్రవీణ్, యాదగిరి, విద్యా సాగర్, మహిపాల్, పాండురంగారెడ్డి, వాజీద్ అలీ, అనంతరావు, రాజు, అశోక్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.