– స్వతంత్ర రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం
– మతోన్మాద బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యం
– భువనగిరి మినహా 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు : తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బరిలో సీపీఐ(ఎం)ను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గం పిలుపునిచ్చింది. స్వతంత్ర రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో టి.జ్యోతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. భువనగిరిలో తమ అభ్యర్థిని బరిలో నిలపడంతో పాటు.. మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బలపర్చాలని నిర్ణయించామని తమ్మినేని తెలిపారు. బీజేపీని ఓడించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఆ మేరకు భువనగిరిలో సీపీఐ(ఎం)ను, మిగిలిన స్థానాల్లో ఇండియా బ్లాక్‌లో భాగస్వామి అయిన కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందింగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాపితంగా బీజేపీ మతోన్మాద శక్తుల ఓటమి కోసం పార్టీ నిర్వహిస్తున్న రాజకీయ ప్రచారం గురించి సమావేశం సమీక్షించిందని పేర్కొన్నారు. దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, బీజేపీ చేసిన అన్యాయాలను ఎండగట్టే కృషిని ఉధృతం చేయాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఈ కృషికి తోడ్పడేందుకు, పార్టీ స్వతంత్ర రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి మహమ్మద్ జహంగీర్‌ను గెలిపించుకోవాలని కోరారు.
బరిలోనే సీపీఐ(ఎం)
2:35 am