సీపీఐ(ఎం) నాయకులు, మహిళలపై అక్రమ కేసులను ఎత్తేయాలి

– దాడి చేసిన ఎస్‌ఐని వెంటనే సస్పెండ్‌ చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి డిమాండ్‌
నవతెలంగాణ -మోతె
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టిపెల్లి సైదులు, మండల కార్యదర్శి ముల్కూరు గోపాల్‌ రెడ్డి, మహిళా కార్యకర్తలపై అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి డిమాండ్‌ చేశారు. అర్హులకు ఇండ్లు ఇవ్వాలని, కేసులను ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని నిరసన తెలిపిన వారిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. మండల కేంద్రంతో పాటు విభాలపురం, అప్పన్నగూడెం గ్రామాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అనేక పర్యాయాలు కలెక్టర్‌, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందించలేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై అనర్హులకు ఇండ్లు ఇచ్చారని ఆరోపించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టి పెల్లి సైదులు, మండల కార్యదర్శి మలుకూరు గోపాల్‌ రెడ్డితో పాటు మహిళా కార్యకర్తలపై మోతె ఎస్‌ఐ దాడి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎస్‌ఐ మహేష్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ తక్షణమే కలగజేసుకొని అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు దక్కేవరకు సీపీఐ(ఎం) వారికి అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సీఐ వీర రాఘవ మాట్లాడుతూ.. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం డిటి సూరయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరి, మట్టిపెల్లి సైదులు, కోట గోపి, నాయకులు నాగం మల్లయ్య, కిన్నెర పోతయ్య, బూడిద లింగయ్య, కె.గోపయ్య, సోమ గాని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.