– అండగా ఉంటామని హామీ
– పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ పోలీసుల చేతిలో హతమైన వామపక్ష కార్యకర్త అనరుల్ ఇస్లాం కుటుంబాన్ని సీపీఐ(ఎం) నాయకులు గురువారం పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం నేతృత్వంలోని సీపీఐ(ఎం) నాయకుల బృందం ఇస్లాం కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా మహమ్మద్ సలీం మాట్లాడుతూ… ఇస్లాం మరణానికి కారణమైన పోలీసులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న ముర్షిదాబాద్ జిల్లాలో బహరంపూర్‌లో శాంతియుతంగా శాసనోల్లంఘన కార్యక్రమం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో అనరుల్ ఇస్లాం మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. కాగా, మరోవైపు ఈ శాసనోల్లంఘన కార్యక్రమంలో మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. రెండు రోజుల నుంచి వీరు పోలీసుల అదుపులోనే ఉన్నారు.
కాగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులపై పోలీసులను ప్రయోగించిన పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై దాడికి పాల్పడుతున్న కేంద్రం, హర్యానాల్లోని బీజేపీ ప్రభుత్వాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడుతున్నారని, అయితే రాష్ట్రంలోని రైతులపై మమతా అదే విధంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం), ఇతర వామపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.
సీఐటీయూ, ఏఐకేఎస్ పిలుపు మేరకు ఈ నెల 13న పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా శాసనోల్లంఘన కార్యక్రమాలను నిర్వహించారు. వీటిపై పోలీసులు అణిచివేత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 మంది గాయపడ్డారు.