మహాసభలకు తరలిన సీపీఐ(ఎం) నాయకులు..

CPI(M) leaders moved to the Mahasabha.నవతెలంగాణ – దుబ్బాక
నేటినుంచి మూడ్రోజులపాటు సంగారెడ్డి పట్టణ కేంద్రంలో జరగనున్న సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభలకు సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ.భాస్కర్ నేతృత్వంలో శనివారం దుబ్బాక మున్సిపల్ కేంద్రం నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ.భాస్కర్ మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) రాష్ట్ర నాలుగో మహాసభలు ఈనెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని.. తొలి రోజున భారీ ప్రజా ప్రదర్శన ,బహిరంగ సభ ఉంటుందని,ఈ మహాసభల్లో కార్మికులు,రైతులు,అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పేద,మధ్యతరగతి,సామాన్య ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిత్యవసర సరుకుల ధరలు,నిరుద్యోగం నానాటికి పెరుగుతున్నాయని, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని విమర్శించారు. విద్య, వైద్యం, ఇతర ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర సర్కార్ పనిచేస్తుందని ఆరోపించారు. దేశంలో ప్రతిరోజు మహిళలు, దళిత, గిరిజనులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని.. వీటిని కట్టడి చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.కేంద్రం అవలంబిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక,కర్షకుల కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం)ను బలపరచాలని ప్రజలను కోరారు. మతం పేరుతో కలిసిమెలిసి ఉన్న ప్రజల మధ్య వైశాల్యాలు సృష్టిస్తున్న వారిపై వ్యతిరేకంగా పోరాడాలని, ఎర్ర జెండా నాయకత్వంలో పోరాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని  విజ్ఞప్తి చేశారు.ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వంపై పోరాడేందుకు సీపీఐ(ఎం) నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ రాష్ట్ర మహాసభలకు బయలుదేరిన వారిలో సీపీఐ(ఎం) దుబ్బాక పట్టణ కార్యదర్శి భాస్కర్ కొంపల్లి, నాయకులు ఎండీ.సాజిద్, ఎల్లం, నాగరాజు, రమేష్, లక్ష్మణ్, అజయ్, పర్శరాములు, భాస్కర్, పోశయ్య, స్వామి, నర్సింలు, బాబు ప్రసాద్, భాస్కర్, యాదమ్మ, కవిత, లచ్చవ్వ, భారతి, బాల్ లక్ష్మి, కనకవ్వ, లక్ష్మి పలువురున్నారు.