నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఉత్తమ తొలి పార్లమెంటేరియన్‌గా సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఎంపికయ్యారు. విశిష్ట లోక్‌మత్ పార్లమెంటరీ అవార్డు 2023ను జాన్ బ్రిట్టాస్ అందుకున్నారు. మంగళవారం నాడిక్కడ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల సమక్షంలో నిర్వహించిన ఒక ముఖ్యమైన వేడుకలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సహాయ మంత్రి రాందాస్ అథవాలే సమక్షంలో జాన్ బ్రిట్టాస్‌కు అవార్డును అందజేశారు. లోక్‌సభలో అత్యుత్తమ కృషికి లోక్‌మత్ అవార్డును ఎంపీ శశిథరూర్ అందుకున్నారు. లోక్‌సభ ఎంపీలు డానిష్ అలీ, మేనకా గాంధీ, హర్‌సిమ్రత్ కౌర్, రాజ్యసభ ఎంపీలు రాం గోపాల్ యాదవ్, సస్మిత్ పాత్ర, సరోజ్ పాండే కూడా లోక్‌మత్ అవార్డులను అందుకున్నారు. పార్లమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగా ఈ అవార్డు లభించింది. జ్యూరీ ప్రెసిడెంట్, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్, లోక్‌మత్ మీడియా గ్రూప్ చైర్మన్ విజరు దర్దా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.జ్యూరీ ప్రెసిడెంట్, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ జాన్ బ్రిట్టాస్‌ను ప్రశంసించారు. రాజ్యసభలో ప్రశ్నలు, ప్రైవేట్ బిల్లులు, చర్చల్లో పాల్గొనడం మొదలైన వాటితో సహా పార్లమెంటరీ కార్యక్రమాల్లో ప్రావీణ్యం వల్లనే ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లాల్ కష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, సీతారాం ఏచూరి, జయా బచ్చన్, సుప్రియా సూలే, ఎన్షికాంత్ దూబే, హేమా మాలిని మరియు భారతీ పవార్ వంటి సీనియర్ నాయకులు గత సంవత్సరాల్లో లోక్‌మత్ అవార్డును అందుకున్నారు. గతేడాది అవార్డు హైదరాబాద్‌కు చెందిన అసదుద్దీన్ ఓవైసీకి దక్కింది.