గ్రామంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సీపీఐ(ఎం)

– గ్రామంలో రోడ్ల మరమ్మతులు చేపట్టి డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ముస్త్యలపల్లి గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం వేసిన సీసీ రోడ్లు ధ్వంసమై, ఎత్తు, ఓంపులు ఉండడం వల్ల మురికి నీరు వర్షపు నీరు రోడ్లమీద పారి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని, తక్షణం సీసీ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, ఇండ్ల పై నుండి వెళ్లిన విద్యుత్తు లైను తీగలను వెంటనే తొలగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరి  మండల పరిధిలోని ముస్త్యలపల్లిలో గ్రామీణ ప్రజా సమస్యల అధ్యయనం కోసం సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమంలో భాగంగా సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పలు వార్డులను పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ.. సర్పంచులు లేకపోవడంతో గ్రామంలోని అభివృద్ధి కుంటుపడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముస్తాలపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు.
గ్రామంలోని ఎస్సీ కాలనీలో రైతుల పొలాలకు విద్యుత్ తీగలను ఇండ్లపై నుండి తీసుకుపోవడం వల్ల అనేక ప్రమాదాల గురవుతున్న పరిస్థితి ఉన్నదని, ఇప్పటికైనా విద్యుత్ అధికారులు ఇండ్ల పై నుండి కరెంటు తీగలను తొలగించి ప్రత్య ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎస్సీ కాలనీలో రోడ్డు పక్కనే సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారం ఉండడం వల్ల తరచూ ప్రమాదాలకు ప్రజలు గురవుతున్నారని, ఈ మధ్యకాలంలో ఒక రైతు పాడి గేద కరెంటు షాక్ తో చనిపోయి, లక్ష రూపాయలకు పైగా నష్టపోయాడని, వారికి తక్షణమే నష్టపరిహారం ఇచ్చి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంకా గ్రామంలో ఇల్లు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, మరుగుదొడ్ల లాంటి సమస్యలు ఉన్నాయన,,వాటిని పరిష్కారం చేయాలని, దోమలు పెద్ద ఎత్తున ప్రజల పైన దాడి చేస్తూ వైరల్ జ్వరాలకు కారణం అవుతున్నాయని, గ్రామపంచాయతీ నుండి దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శి సమస్యల గురించి అడిగితే ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు మా జీతం నుండి ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వము గ్రామంలో ఉన్న మౌలిక సమస్యల పరిష్కారం కోసం తగిన నిధులు విడుదల చేయాలని నర్సింహ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ.. గ్రామ సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో ప్రజలను సమీకరించి గ్రామపంచాయతీ కార్యాలయం దీక్షలు చేపడతామని, ఇప్పటికైనా అధికారులు గ్రామాలలో పర్యటనలు చేసి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో తగిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి  కళ్లెం లక్ష్మీనరసయ్య, నాయకులు ప్రజలు పసునాది దేవయ్య, పసునాది రాజు, పసునాది చంద్రయ్య, గంటపాక రమేష్, పసునాది భాస్కర్, కళ్లెం సాల్ మోహన్, సిర్పంగి కుమార్, గంటపాక యాదగిరిలు పాల్గొన్నారు.