సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలి: సీపీఐ(ఎం)

Farmers should be supported by irrigation: CPI(M)– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి… దయ్యాల నరసింహ
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
బునాదిగాని కాల్వ ద్వారా అనాజిపురం చెరువు నింపి నందనం చెరువులోకి సాగునీరు అందించి రైతన్న ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ అన్నారు. శుక్రవారం నందనం గ్రామ శాఖ మహాసభలో వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. షామీర్పేట నుండి వచ్చే నీటిని భూనాది గాని కాలువ ద్వారా భువనగిరి చెరువును నింపి లింకు కాలువ ద్వారా అనాజిపురం చెరువులోకి నీటిని నింపి నందనం చెరువులోకి సాగునీరు తీసుకురావడం వల్ల ఈ ప్రాంత రైతాంగం కరువుకు దూరం అవుతారని వారు అన్నారు. ఏళ్లు తరబడి బునాదిగాని కాలువ పనులు జరుగుతున్న నేటికీ అక్కడక్కడ కాలువ పనులు పూర్తికాక రైతాంగం పెట్టుకున్న ఆశలను అడియాసలు చేసే విధంగా పాలకుల పని విధానం ఉందని వారు విమర్శించారు. పాలకులు మారుతున్న ప్రభుత్వాలు మారుతున్న రైతుల జీవన విధానం మాత్రం మారడం లేదని బునాదిగాని కాల్వ పనులు పూర్తి కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బునాదిగాని కాలువను పూర్తిచేసి నందనం చెరువును నింపడం ద్వారా వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని వారు అన్నారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రైతు రుణమాఫీ ఇప్పటివరకు కాలేదని రైతులు ఎన్నో ఆశలతో బ్యాంకుల నుండి రుణాలు తెచ్చుకుని పంటలను సాగు చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరితోపాటు మహాసభలో మండల కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, సంఘం జిల్లా అధ్యక్షులు సిరిపంగి ప్రకాష్, మండల కమిటీ సభ్యులు కొండాపురం యాదయ్య, కొల్లూరి సిద్దిరాజు, సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, లచ్చిరెడ్డి, ఆంధ్రయ్య, కొల్లూరు శ్రీకాంత్ లు పాల్గొన్నారు.