నవతెలంగాణ – వలిగొండ రూరల్
వర్కట్ పల్లి గ్రామంలో సీపీఐ(ఎం) పోరు బాటలో భాగంగా ధర్మారెడ్డి కాల్వకు అనుసంధానంగా ఉన్న బ్రిడ్జిపై వెంటనే నూతన బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని శుక్రవారం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి కోరారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాముకాటు, కుక్కకాటుకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) పోరుబాటలో భాగంగా గ్రామంలో సర్వే నిర్వహించగా వర్కట్ పల్లి నుండి పొద్దుటూరు కు వెళ్లే లింకు రోడ్డులో ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిపై నూతన బ్రిడ్జిని వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రోడ్డు మార్గం ద్వారా నిత్యం పొద్దుటూరు,వర్కట్ పల్లి గ్రామాల ప్రజలతోపాటు వందలాది మంది రైతాంగం తమ పంట పొలాలకు వెళ్తున్నారన్నారు. ధర్మారెడ్డి పళ్లి కాలువ కు చెందిన బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందని ఒకవైపు గోడ మొత్తం కూలిపోయి దీని మీదుగా ప్రయాణం చేసేవారు ఎప్పుడు కాలువలో పడిపోతారో తెలియని పరిస్థితి దాపురించిందని అన్నారు. అనేకమంది రైతులు తమ ధాన్యాన్ని ఈ బ్రిడ్జి ద్వారా తీసుకుపోవడానికి రాకపోకలు సాగిస్తారని ఎలాంటి ప్రమాదం జరగకముందుకే ముందస్తుగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. అదేవిధంగా గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము కాటుకు, కుక్క కాటుకు వైద్యం అందక చౌటుప్పల్ భువనగిరి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అనేకమంది రైతులు పంట పొలాల్లో పాముకాటుకు ఈ మధ్యన గురై తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని వెంటనే వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని అదే విధంగా హాస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి, సీపీఐ(ఎం)సీనియర్ నాయకులు గూడూరు బుచ్చిరెడ్డి,చేగురి నరసింహ,రొండి మల్లేశం,గోగు కిష్టయ్య,చేగురి రాములు,రైతులు మీసాల మల్లయ్య,ఏర్పుల అశోక్,మీసాల రవీందర్,రొండి ఐలయ్య,బంగారు నర్సింహ,పల్లెర్ల శ్రీకాంత్, మీసాల శివాజీ తదితరులు పాల్గొన్నారు.