– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శిగా రమేష్ బాబు 3వ సారి ఎన్నిక
నవతెలంగాణ – కంఠేశ్వర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై రాబోవు రోజుల్లో పోరాటాలు తప్పవని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు సోమవారం నగరంలోని నాందేవాడ సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాసీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 26, 27న సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను నిర్వహించడం జరిగింది. మొదటిరోజు ర్యాలీ బహిరంగ సభ జరిగిన అనంతరం ఎంపిక చేసిన ప్రతినిధులతో మాహాసభ కొనసాగింది. ప్రతినిధుల సభలో సంవత్సరాల కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టారు. రంగాల వారీగా ప్రాంతాలవారీగా ప్రతినిధులు చర్చించి తమ అభిప్రాయాలను తెలియజేశారు. 27న సాయంత్రం నూతన జిల్లా కమిటీని 14 మందితో ఎన్నుకున్నారు. నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా ఏ రమేష్ బాబును మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శివర్గ సభ్యులుగా పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, వెంకటేష్, నాగన్న లను జిల్లా కమిటీ సభ్యులుగా ఏషాల గంగాధర్, నన్నే సాబ్, జంగం గంగాధర్, సుజాత, కొండ గంగాధర్, విగ్నేష్, సురేష్, రామ్మోహన్రావు ఎన్నుకోవడం జరిగింది అని జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలియజేశారు. మహాసభలో జిల్లాకు సంబంధించిన వివిధ సమస్యల పైన చర్చించటం జరిగిందని వాటిని వివరిస్తూ జిల్లాలో ఇండ్లు లేని నిరుపేదలు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు, ఇండ్ల స్థలాల కొరకు అనేక మార్లు పోరాటాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ఇంటి అద్దెలను భరించలేక, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు దశాబ్దాల తరబడి ఇంటి పట్టాలను మంజూరు చేయకపోవడం, పేదల పట్ల ఈ ప్రభుత్వాలకు ఉన్న వైఖరి అర్థం అవుతోందని అన్నారు.
రాబోయే కాలంలో పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించటం జరిగింది. అదేవిధంగా జిల్లాలో అత్యధికంగా పనిచేస్తున్న బీడీ కార్మికులకు రోజురోజుకు పని దినాలు తగ్గిపోయి ఆదాయాలు పడిపోతున్నాయని, ప్రభుత్వమే బీడీ పరిశ్రమను ఇప్పించడానికి కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంచటానికి ఆలోచించాలని, కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహించడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిజాంబాద్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిధులు కేటాయించి, పునరుద్ధరించాలని, దాని వలన రైతులు, కార్మికులకు లబ్ది చేకూరుతుందని అన్నారు. అందుకొరకు ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి పార్టీ తరపున ఆందోళన నిర్వహించడానికి నిర్ణయించటం జరిగిందని, జిల్లాలో పండే చెరుకు, మొక్కజొట, వరి పంటలకు మద్దతు ధర బోనస్ ను చెల్లించాలని చర్చించటం జరిగింది. పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి పసుపు ధర కేంద్రం నిర్ణయించి, అమలు జరపాలని డిమాండ్ తో పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. పై సమస్యలతో పాటు నిజాంసాగర్ ఆయకట్టు పరిరక్షణ కొరకు సింగూరును, నిజాంసాగర్ రిజర్వాయర్ గా కొనసాగించాలని డిమాండ్ చేయడం జరిగింది. వీటితో పాటు స్కీమ్ వర్కర్ల సమస్యల పైన కాంట్రాక్టు ఉద్యోగుల కార్మికుల సమస్యలపైన పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో గ్రామాభివృద్ధి కమిటీలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. పేదలు, బలహీన వర్గాలపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు. అందుకొరకు వారి పక్షాన పోరాటాలు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. ఈ మహాసభ తీసుకున్న కర్తవ్యాల అమలు కొరకు రాబోయే మూడు సంవత్సరాలు పార్టీ జిల్లా కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.