కాంగ్రెస్ హామీల అమలుకై ఆందోళనకు సిద్ధం కండి: సీపీఐ(ఎంఎల్)

Prepare for agitation to implement Congress promises: CPI(ML)– సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా బంధ తొరూర్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న

నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో జాప్యాన్ని నిరసిస్తూ దశల వారి ఆందోళనకు ప్రతి ఒక్కరం సిద్ధం కావాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాబంద తొర్రూర్ డివిజన్ కార్యదర్శి, ముంజంపల్లి వీరన్న అన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో సోమవారం కరపత్రలను ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జులై 22న మండల కేంద్రాలలో, 29న జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని, ఇంటి స్థలం గృహ నిర్మాణానికి 10 లక్షలు అమలుచేసి ఇవ్వాలని, పెన్షన్లను అందరికీ వెంటనే ఇవ్వాలని అన్నారు. రైతాంగానికి రుణమాఫీ చేసిన వెంటనే  కొత్త రుణాలు ఇవ్వాలని,10 ఎకరాల లోపు రైతులందరికీ రైతు భరోసాను ఇస్తూ కౌలు రైతులకు వర్తింప చేయాలని తెలిపాడు. వ్యవసాయ కార్మికులకు రూ.12,000 జీవన భృతి వెంటనే మంజూరు చేస్తూ, భవన నిర్మాణ ఇతర సంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. విద్యార్థులకు స్కాలర్ షిప్పులు పెంచుతూ, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే ఇవ్వాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ జాబ్ కాలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే మండల జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నెల్లీకుదురు సంయుక్త మండలాల కమిటీ కార్యదర్శి ఇరుగు అనిల్  మల్లయ్య వెంకన్న, రాములు సైదులు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.