
– తహసిల్దార్ కార్యాలయం ముందు బీడీ కార్మికులతో ధర్నా
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో శుక్రవారం బీడీ కార్మికులందరికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రూ. 4వేల జీవన భృతి ఎలాంటి ఆంక్షలు లేకుండా తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న బీడీ కార్మికులను ఉద్దేశించి సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా రాష్ట్ర సెక్రెట్రియల్ సభ్యులు వి. ప్రభాకర్ మాట్లాడుతూ…. బీడీ పరిశ్రమ త్రీవ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, కార్మికులకు ఉపాధి కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు అనేక ఆంక్షలు విధించి స్త్రీ కూడా ఇబ్బంది కలిగించారని ఆయన తెలిపారు. బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రకరకాల చర్యలను చేపట్టి, సిగరెట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముదిరించి బీడీ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తూ సిగరెట్ పరిశ్రమ అధిపతులకు నరేంద్ర మోడీ ఊడిగం చేస్తున్నాడని విమర్శించారు. మోడీ ఎన్నికల్లో ఉపాధి భద్రత, స్వదేశీ పరిశ్రమల పరిరక్షణ, ప్రతి యేట రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానాలు చేసి, కార్మిక వ్యతిరేక విధానాలతో కార్పొరేట్ కంపెనీలకు సేవ చేస్తున్నాడని ఆరోపించారు.
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగు లేబర్ కోడులను అమలు చేయడం సాధ్యం కాదని తీర్మానం చేయాలని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను కార్మికులకు వర్తింపజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను బహిరంగంగా వేలం వేస్తుందని ఆరోపించారు. కార్మికులకు పని లేక పని దినాలు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, బీడీ పరిశ్రమపై అనేక అంశాలు విధించడం వల్ల ఉపాధిని కోల్పోతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమపై విధించిన ఆంక్షలు తొలగించాలని, జీఎస్టీ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నిమండ్లతో కూడిన వినతి పత్రంతోపాటు కార్మికుల వ్యక్తిగత దరఖాస్తులను తహసిల్దార్ ఆంజనేయులు ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెక్క, అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సారా సురేష్, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి.దేవారం, మండల కార్యదర్శి బి.అశోక్, మోర్తాడ్ ఏరుగడ్ల మండలాల కార్యదర్శి జి.కిషన్, మండల పార్టీ నాయకులు బాలయ్య, రాధ, లక్ష్మి, అశోక్, అరవింద్, పద్మ, తదితరులు పాల్గొన్నారు.