బీజేపీ ఓటమే సీపీఐ(ఎం) లక్ష్యం

CPI(M)'s aim is to defeat the BJP– పేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
– మేడిగడ్డపై న్యాయ విచారణ కమిటీలు వేయాలి
– కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు సిద్ధమే..: రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్‌
బీజేపీని కేంద్రంలోనే కాదు.. రాష్ట్రంలో ఆ పార్టీ ఆధీనంలో ఉన్న నాలుగు ఎంపీ స్థానాల్లోనూ ఓడించడమే తమ లక్ష్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుంకరి వీరయ్య అన్నారు. గురువారం మహబూబాబాద్‌లోని పెరుమాండ్ల జగన్నాథ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరయ్య మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలు వేసుకున్న గుడిసెల స్థలాలకు పట్టాలిచ్చి, ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతుల కోసం నిపుణుల కమిటీ వేయాలన్నారు. డిజైనింగ్‌ నిర్మాణం, అవినీతి, నిర్లక్ష్యంపై న్యాయ విచారణ కమిటీ వేయాలని కోరారు. రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ ఓటమికి సీపీఐ(ఎం) కట్టుబడి ఉందని, అందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీతో సీట్ల సర్దుబాటుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఒంటరిగా పోటీ చేయాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దేశంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉండటం కోసం దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడినట్టు చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో వామపక్షాలు సర్దుబాటుకు సిద్ధంగా ఉన్నాయని సీపీఐ(ఎం) జాతీయ కార్యవర్గం కాంగ్రెస్‌ అధిష్టానానికి తెలిపినట్టు చెప్పారు. భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్‌, నల్లగొండ స్థానాలపై తమకు పట్టు ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్‌ నిర్ణయం కోసం పది రోజులు వేచి చూసినట్టు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఆలస్యం జరిగి నష్టం జరగకముందే సీపీఐ(ఎం) విస్తృత ప్రచారం నిర్వహించేందుకే భువనగిరి అభ్యర్థిగా మహమ్మద్‌ జహంగీర్‌ను ప్రకటించినట్టు చెప్పారు. ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సీపీఐ(ఎం) ప్రచారంలోకి దిగిందని, అందులో భాగంగానే భువనగిరిలో ప్రచారం ప్రారంభించినట్టు తెలిపారు. అయితే, దీని అర్థం సీపీఐ(ఎం) ఒంటరిగా పోటీలో ఉండాలని కాదన్నారు. కాంగ్రెస్‌ నుంచి ప్రతిపాదన వస్తే అభ్యంతరం ఉండదని చెప్పారు. సీపీఐ(ఎం), సీపీఐకి భిన్నాభిప్రాయాలు లేవని, పరస్పర సహకారంతోనే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తాయన్నారు. కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐతో సర్దుబాటు చేసుకోవడం ద్వారా బీజేపీని నిలువరించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్‌ అనేక స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిందని, కానీ వామపక్షాలు గురిపెట్టిన ఖమ్మం, భువనగిరి స్థానాల్లో మాత్రం ఇంకా ప్రకటించలేదని గుర్తు చేశారు. మరో మూడు స్థానాలను కాంగ్రెస్‌ ఇంకా ప్రకటించనప్పటికీ వాటిపై కమ్యూనిస్టులు గురిపెట్టలేదని తెలిపారు. కాంగ్రెస్‌ సర్దుబాటుకు సిద్ధంగా లేకుంటే వామపక్షాలు ఆలోచించి ముందుకు వెళ్తాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గుడిసెవాసులకు ఇచ్చిన హామీల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 69కేంద్రాల్లో గుడిసెలు వేసుకున్న లక్ష మందికి ఇంటి స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ గృహాలకు రూ.5లక్షల చొప్పున మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. మహబూబాబాద్‌ పట్టణంలో కురవి రహదారిలో పేదలు వేసుకున్న గుడిసెలను 19సార్లు పోలీసు, రెవెన్యూ, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు ధ్వంసం చేశారని, పేదల గుడిసెలను కాల్చేసి నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేండ్లుగా పేదలు అక్కడే చెట్ల కింద తలదాచుకుంటున్నారన్నారు. గుడిసెవాసులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) సీఎం రేవంత్‌రెడ్డిని మూడుసార్లు, సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని రెండుసార్లు కలిసి విన్నవించినట్టు గుర్తు చేశారు.