నవతెలంగాణ – దుబ్బాక
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీలంగా పోరాడుతూనే.. రాష్ట్ర అభివృద్ధి కోసం సీపీఐ(ఎం) అనేక పోరాటాలు నిర్వహిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ.భాస్కర్ పేర్కొన్నారు.సమస్యలపై ప్రజలను సంఘటిత పరుస్తూ.. లౌకిక,ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకై అవినీతి,నిరుద్యోగానికి వ్యతిరేకంగా, కార్మిక,రైతాంగ హక్కుల రక్షణ,కనీస వేతనాల కోసం అనునిత్యం పోరాడుతున్న ఏకైక పార్టీ సీపీఐ(ఎం) మాత్రమేనని స్పష్టం చేశారు.ఈనెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర నాల్గవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శనివారం దుబ్బాకలో ఇంటింటా ప్రచారం చేస్తూ విరాళాలు సేకరించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. పేదలు, కార్మికులు, ఉద్యోగులు, కష్టజీవులు హక్కుల కోసం ప్రజాస్వామ్యం, లౌకిక విధానం, సామాజిక న్యాయం కోసం అంకితభావంతో ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అని నొక్కి చెప్పారు.మహాసభల విజయవంతం కోసం గత 15 రోజులుగా విరాళాలు సేకరించడం జరుగుతుందని.. రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు వెల్లడించారు.సీపీఐ(ఎం) ను ఆదరించి ఈ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.వారి వెంట సీపీఐ(ఎం) దుబ్బాక పట్టణ, మండల కార్యదర్శులు కొంపల్లి భాస్కర్,సింగిరెడ్డి నవీన,నాయకులు బత్తుల రాజు,లక్ష్మీనరసయ్య,మహేష్,మెరుగురాజు,ప్రశాంత్ పాల్గొన్నారు.