నవతెలంగాణ-గోవిందరావుపేట
గత కొంతకాలంగా వీధిలైట్లు వెలగక పసర గ్రామపంచాయతీ ప్రజలు చీకట్లలో మగ్గుతున్నారు. గురువారం రాత్రి సీపీఐఎం పార్టీ పసర గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో రాత్రివేళ కురువత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చిట్టిబాబు మాట్లాడుతూ
పంచాయితీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన సక్రమంగా జరగడంలేదని గ్రామ ప్రజలు చాలా రోజులుగా వీధి దీపాలు రాక చీకట్లో మగ్గుతున్నారని పేరుకు 163 వ జాతీయ రహదారి రాత్రి మాత్రం చీకటి రహదారిగా మిగిలిపోతుందని అన్నారు. వెలుతురు లేకపోవడం వల్ల ప్రమాదాలు విష పురుగుల బారిన పడుతూ జనాలు ఇబ్బంది పడుతున్నారని ప్రతిరోజు వర్షం కురుస్తుండడంతో ఎక్కడ వర్షం నీరు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు నెలకొని వాహనదారులు కాలినడకన వెళ్లే ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సెంట్రల్ లైటింగ్ సిస్టం పనిచేసేలా చూడాలని అన్నారు. మండలంలో అతిపెద్ద గ్రామపంచాయతీగా పేరున్న ఆదాయం అధికంగా ఉన్న సెంట్రల్ లైటింగ్ సిస్టం రాకపోవడం అధికారులు పట్టించుకోకపోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు గ్రామ ప్రజలు స్వచ్ఛంద సేవ నాయకులు తదితరులు పాల్గొన్నారు.