సీపీఎస్‌ ఉద్యోగులను పాత పెన్షన్‌ పరిధిలోకి తేవాలి

– సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) విధానంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులను పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) పరిధిలోకి వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. దేశంలో ప్రవేశపెట్టిన నూతన పెన్షన్‌ విధానం (సీపీఎస్‌) అమల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, సెప్టెంబర్‌ ఒకటి నుంచి సీపీఎస్‌ విధానం అమలవుతున్నదని గుర్తు చేశారు. సీపీఎస్‌ అమలు తేదీ కంటే ముందే నోటిఫికేషన్లు విడుదలై నియామక ప్రక్రియ ఆలస్యమవ్వడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులను బలవంతంగా సీపీఎస్‌ పరిధిలోకి తెచ్చారని తెలిపారు. ఉపాధ్యాయుల నియామకాలను పరిశీలిస్తే డీఎస్సీ-2003 నోటిఫికేషన్‌ ఆ ఏడాది నవంబర్‌ 13న విడుదలైందని పేర్కొన్నారు. 2004లో పరీక్షలు నిర్వహించి అదే ఏడాది జూన్‌ 11న ఫలితాలు వెలువడ్డాయని గుర్తు చేశారు. కానీ నియామక ప్రక్రియ ఆలస్యంగా 2005, నవంబర్‌ 21న పూర్తయ్యిందని వివరించారు. దీంతో వారిని కూడా సీపీఎస్‌ పరిధిలోకి తెచ్చారని తెలిపారు. అదే విధంగా పోలీస్‌ శాఖ, గ్రూప్‌-1, గ్రూప్‌-2 నియామకాల్లో కూడా 2004, సెప్టెంబర్‌ ఒకటో తేదీకి ముందు నోటిఫికేషన్‌ విడుదలై నియామకాలు తర్వాత జరగడంతో సీపీఎస్‌ విధానంలో వారు కొనసాగుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడదు
ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో 2004, సెప్టెంబర్‌ ఒకటికి ముందు నియామక ప్రక్రియ పూరయ్యి ఆ తర్వాత చేరిన వారిని పాత పెన్షన్‌ పరిధిలోకి తెస్తూ మెమో (నెంబర్‌ 57/04/2019, తేది 2020, ఫిబ్రవరి 17)ను జారీచేసిందని తమ్మినేని తెలిపారు. ఆ తర్వాత విడుదల చేసిన మెమో (నెంబర్‌ 57/05/2021 పీఅండ్‌ పీడబ్ల్యు తేది 2023, మార్చి 3) ప్రకారం 2003, డిసెంబర్‌ 22 నాటికి నోటిఫికేషన్‌ విడుదలై సీపీఎస్‌ విధానంలో కొనసాగుతున్న వారందరినీ పాత పెన్షన్‌ పరిధిలోకి తీసుకునేలా ఉత్త ర్వులిచ్చిందని గుర్తు చేశారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే మార్పులు చేర్పులను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో దాదాపు తొమ్మిది వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని పాత పెన్షన్‌ పరిధిలోకి తేవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపైన తక్షణం ఎలాంటి ఆర్థిక భారం పడబోదని వివరించారు. అందువల్ల ఈ రాష్ట్రంలో కూడా సీపీఎస్‌ పరిధిలోకి బలవంతంగా నెట్టివేయబడ్డ ఉద్యోగ, ఉపాధ్యాయులను పాత పెన్షన్‌ పరిధిలోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.