సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే…

– యూఎస్పీసీ ఆధ్వర్యలో నేడు మహా ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీపీఎస్‌ను రద్దు, పెండింగ్‌ బిల్లుల మంజూరు, మధ్యంతర భృతి తదితర డిమాండ్ల వరిష్కారం కోసం శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కువద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి (యూఎస్పీసీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘా ల నేతలు పాల్గొంటున్నట్టు ఆ కమిటీ నేతలు తెలిపారు. సెప్టెంబర్‌ 1 పెన్షన్‌ విద్రోహదినాన్ని పురస్కరించుకుని సీపీిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని వారు డిమాండ్‌ చేశారు. 2004 సెప్టెంబర్‌ 1 కంటే ముందే ప్రక్రియ పూర్తై, తర్వాత నియామకమైన వారికి పాత పెన్షన్‌ వర్తింపజేయాలని కోరారు. ట్రెజరీల్లో ఆమోదం పొంది సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రెండవ వేతన సవరణ కమిటీని నియమించి జులై 1 నుంచి మధ్యంతర భృతి ప్రకటించాలనీ, స్పెషల్‌ టీచర్‌ సర్వీసుకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలనీ, కాంట్రాక్టు ఉద్యోగులకు బేసిక్‌ పే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.